
న్యూఢిల్లీ: ఇంట్లో నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని వివిధ పార్టీలకు చెందిన 150 మందికి పైగా ఎంపీలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం తీసుకురావాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నోటీస్ ఇచ్చారు. 2025, జూలై 21న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సెషన్ మొదలైన తొలిరోజే అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం తీసుకురవాలని స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు.
ALSO READ | మార్నింగ్ వాక్ చేస్తుండగా అస్వస్థత.. చెన్నై అపోలో ఆసుపత్రికి తమిళనాడు సీఎం స్టాలిన్
అధికార ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీల ఎంపీలు నోటీస్‌పై సైన్ చేయగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల సభ్యుల కూడా ఈ మెమెరాండంపై సంతకం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే సంతకాలు చేశారు.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిని రాజ్యాంగం ప్రకారం తొలగించడానికి పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. పార్లమెంటులోని ఏ సభలోనైనా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అభిశంసన తీర్మానం ముందుకు సాగాలంటే కనీసం 50 మంది రాజ్యసభ ఎంపీలు లేదా 100 మంది లోక్ సభ ఎంపీలు దానిపై సంతకం చేయాలి. సభ్యులు ఇచ్చిన నోటీస్ ఆమోదించాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
ఈ కమిటీ ఒకటి నుంచి మూడు నెలల్లో తన నివేదికను సమర్పిస్తుంది. ఈ రిపోర్టును వచ్చే సెషన్లో చర్చకు పెట్టి అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. ఉభయ సభల్లో మెజార్టీ లభిస్తే తీర్మానం పాస్ అవుతోంది. ఉభయ సభలలో తీర్మానం ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులు జారీ అయిన తక్షణమే, సంబంధిత న్యాయమూర్తి పదవిలో ఉండటానికి అనర్హులు అవుతారు.
కాగా, 2025 మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఒక గదిలో భారీగా కాలిన, పాక్షికంగా కాలిన కరెన్సీ నోట్ల కట్టలు లభించాయి. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు రూ. 15 కోట్ల వరకు నగదు బయటపడినట్లు వార్తలు వచ్చాయి.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ జీఎస్ సందావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌లతో త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నది నిజమేనని ధృవీకరిస్తూ ఈ మేరకు నివేదిక సమర్పించింది.