
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను జైలు నుంచి విడుదల చేయడాన్ని కేంద్రం సవాల్ చేసింది. తీర్పును మరోసారి సమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దోషుల విడుదలపై వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని కేంద్రం వ్యాఖ్యానించింది.
నిందితుల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు న్యాయాన్ని దుర్వినియోగం చేసేలా ఉందని కేంద్రం తన పిటిషన్లో పేర్కొంది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందినవారని.. మాజీ ప్రధానిని హత్య చేసి ఉగ్రవాదులుగా ముద్రపడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని..దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది.
రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు నిందితులను విడుదల చేయాలని ఇటీవలె సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నళిని శ్రీహరన్ సహా నిందితులంతా విడుదలయ్యారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నిందితుల విషయంలో కోర్టు తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆమోదయోగం కాదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.