మరింత ఈజీగా షేర్లలోకి విదేశీ పెట్టుబడులు..వాటా పరిమితి 24శాతానికి పెంపు

మరింత ఈజీగా షేర్లలోకి  విదేశీ పెట్టుబడులు..వాటా పరిమితి 24శాతానికి పెంపు

 

  • విదేశాల్లోని ఒక వ్యక్తి లిస్టెడ్ కంపెనీలో10 శాతం వరకు పెట్టుబడి పెట్టే చాన్స్
  • ఇది వరకు కేవలం ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు, ఓసీడీలకు మాత్రమే ఈ అవకాశం
  • కంపెనీలో విదేశీయులందరూ  పెట్టే పెట్టుబడుల లిమిట్‌ 
  • 10 నుంచి 24 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: డాలర్లను పెద్ద మొత్తంలో ఆకర్షించడానికి, రూపాయిని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త  చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ బాండ్ మార్కెట్‌‌లోకి వచ్చే పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎత్తేసిన విషయం తెలిసిందే.  తాజాగా షేరు మార్కెట్‌‌లో పెట్టుబడులపై రూల్స్‌‌ను కూడా సులభం చేసింది.  

 విదేశాల్లో నివసించే వ్యక్తులు భారతదేశంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లలో సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా  ఫారిన్ ఎక్స్చేంజ్‌‌ మేనేజ్‌‌మెంట్ యాక్ట్‌‌ (ఫెమా) నిబంధనలను సవరిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్  (డీఈఏ)  నోటీసు జారీ చేసింది. ఈ కొత్త సవరణలు  వెంటనే అమలులోకి వచ్చాయి.

కొత్త నిబంధనలు..

ఇంతకుముందు కేవలం ప్రవాస భారతీయులు (ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐలు) లకు మాత్రమే అందుబాటులో ఉన్న పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్ట్‌‌మెంట్ స్కీమ్‌‌ (పీఐఎస్‌‌)ను, ఇప్పుడు భారతదేశం వెలుపల నివసించే ఇతర వ్యక్తుల (పర్సన్స్‌‌ రెసిడెంట్ ఔట్‌‌సైడ్ ఇండియా– పీఆర్‌‌‌‌ఓఐల) కు  కూడా ప్రభుత్వం విస్తరించింది. దీనివల్ల విదేశీయులు నేరుగా భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం సులువవుతుంది.

విదేశాల్లో ఉండే ఒక వ్యక్తి ఏదైనా ఒక లిస్టెడ్ కంపెనీలో  10శాతం వరకు పెట్టుబడి పెట్టొచ్చు. గతంలో ఈ పరిమితి 5శాతంగా ఉంది.  ఇలాంటి విదేశీ వ్యక్తులు, సంస్థలు మొత్తం కలిసి ఒక కంపెనీలో పెట్టే గరిష్ట పెట్టుబడి పరిమితిని (ఓవరాల్ క్యాప్‌‌ను) 10శాతం నుంచి ఏకంగా 24 శాతానికి పెంచారు. 

విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున భారత మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికే ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌పీఐల) మార్గం అందుబాటులో ఉంది.  ఎఫ్‌‌పీఐ కింద రిజిస్టర్ అయిన ఒక సంస్థ ఒక భారతీయ కంపెనీలో గరిష్టంగా 10శాతం వరకు పెట్టుబడి పెట్టడానికి ముందే అనుమతి ఉంది.

సరిహద్దు దేశాలపై  నిఘా..

భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాల కంపెనీలు లేదా పౌరులు ఈ పథకం ద్వారా భారతీయ కంపెనీల యాజమాన్య హక్కులను లేదా నియంత్రణను పొందేందుకు ప్రయత్నిస్తే, దానికి ముందస్తు ప్రభుత్వ అనుమతి  తప్పనిసరిగా తీసుకోవాలి. సింగపూర్‌‌‌‌, యూఏఈ వంటి దేశాల నుంచి  పెట్టుబడి పెట్టినా,  అసలు ఓనర్ ఈ దేశాల పౌరుడైతే ఈ నిబంధన వర్తిస్తుంది. 

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. 

విదేశీ ఇన్వెస్టర్లు నిర్దేశించిన 10శాతం పరిమితిని దాటి షేర్లను కొనుగోలు చేస్తే..

  • అదనపు షేర్లను సదరు లావాదేవీ సెటిల్‌‌మెంట్ అయిన తేదీ నుంచి 5 ట్రేడింగ్ రోజులలోగా విక్రయించాలి.
  • ఒకవేళ ఆ ఇన్వెస్టర్ నిర్ణీత గడువులోగా అదనపు షేర్లను అమ్మకపోతే, ఆ కంపెనీలో వారు పెట్టిన మొత్తం పెట్టుబడిని ఎఫ్‌‌డీఐగా మార్చేస్తారు. అలా మారిన తర్వాత ఆ వ్యక్తి సదరు కంపెనీలో మళ్లీ పోర్ట్‌‌ఫోలియో ఇన్వెస్ట్‌‌మెంట్ చేయడానికి వీలుండదు. ఎఫ్‌‌డీఐగా మారితే పెట్టుబడి లాక్ అయిపోతుంది. షేర్లను అంత సులభంగా, త్వరగా మార్కెట్లో అమ్మడానికి వీలుండదు. డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే రూల్స్‌ పాటించాలి.