లాక్ డౌన్ లో పేద‌ల‌కు రిలీఫ్‌: రేష‌న్ కార్డుతో ఆధార్ లింక్ గ‌డువు పెంపు

లాక్ డౌన్ లో పేద‌ల‌కు రిలీఫ్‌: రేష‌న్ కార్డుతో ఆధార్ లింక్ గ‌డువు పెంపు

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో నిరుపేద‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది. రేష‌న్ కార్డును ఆధార్ నంబ‌ర్ తో లింక్ చేయ‌లేద‌న్న కార‌ణంగా ఎక్క‌డా ఏ ఒక్క‌రికీ రేష‌న్ స‌రుకుల స‌ర‌ఫ‌రా నిలిపేయొద్ద‌ని కేంద్ర క‌న్జ్యూమ‌ర్ అఫైర్స్, ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆధార్ సీడింగ్ గ‌డువును ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించింది. అప్ప‌టి వ‌ర‌కు ఆధార్ కార్డు లేద‌ని గానీ, ఆధార్ లింక్ చేయ‌లేద‌ని గానీ ఎవ‌రి పేర్ల‌ను రేష‌న్ కార్డు నుంచి తొల‌గించొద్ద‌ని సూచించింది. అర్హులైన‌ ఏ ఒక్క‌రికి కూడా రేష‌న్ నిరాక‌రించొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. అలాగే నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్ర‌కారం దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఆహార భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, ఎవ‌రికైనా బ‌యోమెట్రిక్ మెషీన్ల‌లో వేలి ముద్ర స‌రిగా ప‌డ‌లేద‌ని రేష‌న్ ఇవ్వ‌కుండా ఆప‌డం లాంటివి జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది కేంద్రం. ప్ర‌స్తుతం ఉన్న క్రైసిస్ స‌మ‌యంలో ఏ పేదవాడు కూడా ఆక‌లితో ఉండ‌కుండా చూసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.

ఇప్ప‌టికే 90 శాతం ఆధార్ లింక్ పూర్తి

దేశ వ్యాప్తంగా 23.5 కోట్ల రేష‌న్ కార్డులు ఉన్నాయని, వాటిలో ఇప్ప‌టికే కుటుంబంలో క‌నీసం ఒక్క‌రైనా ఆధార్ సీడింగ్ చేయించుకున్నార‌ని కేంద్రం తెలిపింది. అలాగే సుమారు 85 శాతం కార్డుల‌కు సంబంధించి ఫ్యామిలీలో ఉన్న అంద‌రూ (80 కోట్ల మంది ల‌బ్ధిదారులు) సీడింగ్ పూర్తి చేసుకున్నట్లు చెప్పింది. ఇంకా మిగిలిన వారితో కూడా రేష‌న్ కార్డు – ఆధార్ లింక్ చేయించేందుకు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కృషి చేస్తున్నాయ‌ని తెలిపింది. ఆధార్ సీడింగ్ పూర్త‌యిన వారికి వ‌న్ నేష‌న్ – వ‌న్ రేష‌న్ కార్డు విధానంలో ఇంట‌ర్ స్టేట్ పోర్ట‌బులిటీని అమ‌లు చేస్తూ ఏ రాష్ట్రంలోనైనా రేష‌న్ స‌రుకులు తీసుకునేలా అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. దీని ద్వారా ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన వారికి ల‌బ్ధి చేకూరుతోంద‌ని తెలిపింది.