ఏనుగును చంపిన వారిని వదిలిపెట్టేది లేదు: ప్రకాశ్ జవదేకర్

ఏనుగును చంపిన వారిని వదిలిపెట్టేది లేదు: ప్రకాశ్ జవదేకర్
  • కేరళ ఏనుగు మృతిపై కేంద్రం సీరియస్
  • కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖుల డిమాండ్

న్యూఢిల్లీ: కేరళలో ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదిలేది లేదని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. క్రాకర్స్ తినిపించి మూగజీవాలను చంపడం భారతీయ సంస్కృతే కాదని ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చిందన్నారు. మే 27 న కేరళలోని పాలక్కడ్ లో ఆకలిగా ఉన్న ఆడ ఏనుగు టపాసులు నింపిన పైనాపిల్ తినడంతో చనిపోయింది. ఈ ఘటనకు కారణమైన వారిపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

ఇది సాటి మనిషి హత్యగానే పరిగణించాలి: రతన్ టాటా
ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పందించారు. అమాయక ఏనుగును క్రూరంగా చంపిన ఘటన తనని కలచివేసిందన్నారు. మూగజీవాల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు ముగింపు పలకాలని, జంతువులపై ప్రేమను చూపండని పిలుపునిచ్చారు.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం, శ్రద్ధాకపూర్‌ డిమాండ్‌ చేశారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేలు ఇస్తామని హ్యుమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా బహుమతి ప్రకటించింది.

వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం: కేరళ సర్కార్
కాగా, ఏనుగు మృతి ఘటనపై వైల్డ్ లైఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఏనుగు మృతి సర్వత్రా ఆగ్రహాలను రేకెత్తించిందని, అందుకు కారకులను వదిలేది లేదని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. పాలక్కడ్ జిల్లాలోని ఫారెస్ట్, పోలీస్ డిపార్ట్ మెంట్లను నిందుతులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు కేరళ అటవీ శాఖ మంత్రి కె.రాజు స్పందిస్తూ.. పాలక్కడ్​లో ప్రెగ్నెంట్​గా ఉన్న ఏనుగు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.