భూగర్భ జలాల లెక్క తేల్చేందుకు ‘జల్ దూత్’.. బావుల కాడికి పోయి ఏం చేస్తారంటే..

భూగర్భ జలాల లెక్క తేల్చేందుకు ‘జల్ దూత్’.. బావుల కాడికి పోయి ఏం చేస్తారంటే..
  • బావుల్లో నీటి మట్టాల లెక్కింపు
  • డేటా నమోదుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశం
  • ప్రీ- మాన్‌‌‌‌‌‌‌‌సూన్ వివరాల సేకరణకు జూన్ 15 వరకు గడువు

హైదరాబాద్​, వెలుగు: దేశవ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బావుల్లో నీటి మట్టాలను లెక్కించే ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జల్‌‌‌‌‌‌‌‌దూత్’ మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయి డేటాను సేకరించాలని సూచించింది.

సోమవారం నుంచి జూన్ 15వ తేదీ వరకు బావుల్లో నీటి లభ్యతపై సర్వే నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. గ్రామాల్లోని ఎంపిక చేసిన బావుల వద్దకు వెళ్లి, ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉందో కొలిచి, ఆ వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌‌‌‌‌‌‌‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. 

భూగర్భ జలాల స్థితిగతులను పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ డేటా కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రక్రియ కోసం జల్‌‌‌‌‌‌‌‌దూత్ యాప్ అప్‌‌‌‌‌‌‌‌డేటెడ్ వెర్షన్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం విడుదల చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది దీనిని ‘ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ఈజీఏ సాఫ్ట్’ పోర్టల్ నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డేటా సమర్పణ కోసం పాత లాగిన్ ఐడీ, పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌లనే వినియోగించాలని సూచించారు.