
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులు కావడం గమనార్హం. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అపరేష్ కుమార్ సింగ్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తెలంగాణ హైకోర్టుకు ప్రస్తుతం తాత్కాలిక సీజేగా కొనసాగుతున్న సుజయ్ పాల్ను కోల్కత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
ఇక.. తెలంగాణ కొత్త సీజే పూర్వాపరాలను పరిశీలిస్తే.. అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1990 నుంచి 2000 వరకూ ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో న్యాయవాదిగా జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు.. 2022 నుంచి 2023 వరకూ జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
2023 ఏప్రిల్ 17 నుంచి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ కొనసాగుతున్నారు. కొలీజియం సిఫార్సుతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమితులు కావడం విశేషం. ఆయన స్థానంలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. జస్టిస్ రామచందర్‌రావు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రస్తుతం విధుల్లో ఉన్న జస్టిస్ కేఆర్ శ్రీరామ్ రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం కొనసాగుతున్న జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ మద్రాస్ హైకోర్టు కొత్త సీజేగా నియమితులయ్యారు.