న్యూఢిల్లీ: ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారంలోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా వెకెట్ చేయాలని నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రభుత్వ ఆదేశాలపై కోర్టుకెళ్లాలని నిర్ణయించింది.
కాగా, గత 48 ఏండ్లుగా కాంగ్రెస్.. తన పార్టీ వ్యవహారాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. గతేడాది కోట్లా మార్గ్‌లో ‘ఇందిరా భవన్’పేరుతో కాంగ్రెస్ తన కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించింది. అయినా పాత ఆఫీసులో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిల్డింగ్‌ను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మేం ఖాళీ చేయం..
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ఆదేశించడం కక్ష సాధింపు రాజకీయమేనని పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ బంగ్లా కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదని, అది పార్టీ వారసత్వానికి ప్రతీక అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పింది. మార్కెట్ ధరకే తాము ఈ బంగ్లాకు అద్దె చెల్లిస్తున్నామని, ఎంపీల పేర్ల మీద ఈ భవనాన్ని కేటాయించాలని కోరినా ప్రభుత్వం నిరాకరించిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు.
