- ఎర్రజెండాలన్నీ ఏకమైతేనే ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ
కరీంనగర్, వెలుగు: బీజేపీ ప్రభుత్వం దేశంలోని సంపదనంత కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెడుతోందని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. బీజేపీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణకు ఎర్రజెండాలన్నీ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే బహిరంగ సభ ప్రచార జాత సోమవారం కరీంనగర్ కు చేరగా, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
పద్మానగర్ నుంచి రాంనగర్, మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అనంతరం చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి అదానీ, అంబానీ వంటివారికి కట్టబెడుతూ, దేశాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సమ సమాజ స్థాపన కోసం ఆవిర్భవించిన సీపీఐ వందేండ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దేశ ప్రజానీకానికి బాసటగా నిలిచిందని గుర్తు చేశారు.
యాత్రలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్,రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
