డిసెంబర్ 7న ఛలో రాజ్ భవన్ ముట్టడి : చాడ వెంకటరెడ్డి

డిసెంబర్ 7న ఛలో రాజ్ భవన్ ముట్టడి : చాడ వెంకటరెడ్డి

దేశంలో గవర్నర్ వ్యవస్థ అధ్వానంగా తయారైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. వచ్చే నెల డిసెంబర్ 7వ తేదీన ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దేశంలో నేర చరిత్ర కలిగి ఉన్న 5,907 మంది ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధుల కేసులలో న్యాయవ్యవస్థ సత్వరమే తీర్పులు ఇవ్వాలని కోరారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో..మంత్రుల ఆస్తులపై ఐటీ దాడులు చేయిస్తూ బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు. 

కేంద్రప్రభుత్వ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో పడిందని చాడ వెంకటరెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే టీఆర్ఎస్‭తో తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. టీఆర్ఎస్‭కు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్‭తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని చెప్పిన చాడ వెంకటరెడ్డి.. వామపక్షాలను అర్థం చేసుకునేలా వ్యవహరించాలని కోరారు.