శివసేనలో మొదట్నుంచీ తిరుగుబాట్లే..

శివసేనలో మొదట్నుంచీ తిరుగుబాట్లే..

దేశ రాజకీయాల్లో మహారాష్ట్ర అంశం హాట్ టాపిక్ అయ్యింది.  అక్కడున్న మహా వికాస్ ఆఘాడీ సర్కారు కూలిపోయింది. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దీనికి కారణం శివసేనలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడమే. వీరికి శివసేన సీనియర్ నేత, ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహించారు. పది రోజులకుపైగా నడిచిన హైడ్రామా తర్వాత సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మొత్తం 165 మంది సభ్యుల బలంతో కొత్త సర్కారు కొలువుదీరింది. శివసేన ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కువమంది ఎమ్మెల్యేలున్నా డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకుంది బీజేపీ. రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండేకు సీఎం పదవిని అప్పగించింది. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల తిరుగుబాటు.. ప్రభుత్వాలు కూలిపోవడం సర్వసాధారణం అయిపోయింది. వివిధ కారణాలతో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం చాలా చూశాం.  కానీ మహారాష్ట్ర ఇష్యూ చాలా స్పెషల్. ఎందుకంటే.. ఇది ఒక ప్రభుత్వానికి కాదు ఏకంగా ఓ పార్టీ అస్తిత్వానికి దెబ్బలా మారింది. పార్టీ ప్రారంభించిన వారి నుంచి పూర్తిగా చేజారిపోయే పరిస్థితి వచ్చింది. ఏక్ నాథ్​ షిండే చాలాకాలంగా శివసేనలో ఉన్నారు. కిందిస్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు.  ఇప్పుడు ఆయన శివసేనను టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

శివసేన పూర్వాపరాలు.. 

శివసేన అనేది రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు.  ఓ ప్రత్యేకమైన ఎజెండాతో పుట్టిన పార్టీ.  ప్రాంతీయ అస్తిత్వం, భాషా ప్రాధాన్యత కోసం.. తమ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి పుట్టిన పార్టీ.  తమది హిందూత్వ ఎజెండా అని శివసేన ప్రకటించుకుంది. 1966లో బాల్ థాక్రే శివసేనను ప్రారంభించారు. యునైటెడ్ మహారాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసిన.. కేశ్ సీతారాం థాక్రే కుమారుడే బాల్ థాక్రే. ఆయన తన తండ్రి ఆలోచనల నుంచి పార్టీని నిర్మించారు. మహారాష్ట్రను రక్షించడమే తమ లక్ష్యమన్నారు. దీనికోసం శివసేన అనేక పోరాటాలు చేసింది. ఇతర ప్రాంతాల వాళ్లు వచ్చి, తమ భాషను, సంస్కృతిని పాడు చేస్తున్నారని ఉద్యమాలు చేశారు. నాన్ లోకల్స్ తో తమవారి ఉద్యోగాలు పోతున్నాయనే కారణంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తరిమికొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర అస్తిత్వం కోసం నాడు పోరాడిన శివసేన.. ఇప్పుడు తన అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.  ప్రభుత్వం చేజారిపోయింది. తన తండ్రి ప్రారంభించిన పార్టీ అయినా చేజారకుండా చూసుకోవాలనే ప్రయత్నాల్లో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. శివసేనకు ఇలాంటి సంక్షోభాలు కొత్తేం కాదు. పార్టీ ప్రారంభించి 56 ఏళ్లు అవుతోంది.  ఈ 56 ఏళ్లలో నాలుగు సార్లు తిరుగుబాట్లు జరిగాయి. కానీ ఈ సారి ఏకంగా 39 మంది ఎదురుతిరగడం సంచలనమైంది.  పైగా.. శివసేన పార్టీ కూడా తమదేనని రెబల్స్ క్లెయిమ్ చేసుకుంటుండటం ఉద్ధవ్ థాక్రేకు ఊపిరి సలవనివ్వడం లేదు. 

చగన్ భుజ్ బల్ తో మొదలు.. 

శివసేనలో తిరుగుబాటు చేస్తున్న వారు కూడా చాలాకాలంగా ఆ పార్టీతో కలిసి ఉన్నవారు. ముఖ్యనేతలతో మంచి సంబంధాలున్నవారు... పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఉన్నవారు కావడం విశేషం. శివసేనలో ఎమ్మెల్యేల తిరుగుబాటు చగన్ భుజ్ బల్ తో మొదలైంది. చగన్ భుజ్ బల్ పొలిటికల్ కెరీర్ మొదలైందే శివసేనలో.  సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన ఆయన..  బైకుల్లా మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునేవారు. 1960లో బాల్ థాక్రే పార్టీ పెట్టాక.. ఆ సిద్ధాంతాలకు ఛగన్ భుజ్ బల్ ఆకర్షితులు అయ్యారు. ఆయనతో  కలిసి పనిచేయడం ప్రారంభించారు.  ఓబీసీ నాయకుడైన భుజ్‌బల్‌.. గ్రామీణ ప్రాంతాల్లో శివసేన బలోపేతం కోసం చాలా కృషి చేశారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో శివసేన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి.  అయితే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా మాత్రం మనోహర్‌ జోషికి ఇచ్చారు పార్టీ అధినేత బాల్‌ థాక్రే. దీంతో మనస్తాపానికి గురైన భుజ్‌బల్‌.. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  ఆ తర్వాత శరద్ పవార్ తో కలిసిన ఆయన ప్రస్తుతం ఎన్సీపీలో ఉన్నారు.  అయితే.. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలతో బాల్ థాక్రే సంప్రదింపులు జరపడంతో కొద్దిరోజులకే వారిలో 12 మంది తిరిగి వచ్చేశారు. దీంతో సంక్షోభం కొద్దిరోజుల్లోకి ఓ కొలిక్కి వచ్చింది. చగన్ భుజ్ బల్ శివసేనకు దూరమయ్యారు. 

1999లో మరో ఎదురుదెబ్బ 

చగన్ భుజ్ బల్ షాకిచ్చిన ఎనిమిదేళ్లకు అంటే.. 1999లో శివసేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 1999లో నారాయణ రాణె ఎదురుతిరిగారు. నారాయణ రాణెను ఏరి కోరి ముఖ్యమంత్రిని చేశారు శివసేన అధినేత బాల్‌ థాక్రే. అలాంటి వ్యక్తిపైనే నారాయణ రాణె ఎదురుతిరిగారు. బీజేపీ, శివసేన తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు..  1999లో 8నెలలు ఆయన సీఎంగా పనిచేశారు.  అయితే 2003లో ఉద్ధవ్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన అసమ్మతి స్వరం వినిపించారు. మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంపై రాణెకు పట్టుంది. సీఎం పదవి కూడా చేతిలో ఉండటంతో.. మొత్తం పార్టీనే తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించారనే విమర్శలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక పనులు చేస్తున్నారనే ఆరోపణలు నారాయణ రాణెపై  వచ్చాయి. టిక్కెట్లు అమ్ముకున్నారని కొందరు నేతలు బయటకు వచ్చి మాట్లాడటంతో బాల్ థాక్రే సీరియస్ అయ్యారు. నారాయణ రాణెను 2005లో పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి మొదట కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. 2019లో దాన్ని బీజేపీలో విలీనం చేశారు.

2006లో సొంత కుటుంబం నుంచే.. 

2006లో సొంత కుటుంబం నుంచే బాల్‌థాక్రేకు వ్యతిరేకత ఎదురైంది. శివసేన పగ్గాలు ఎవరికి ఇస్తారనే విషయంపై అప్పట్లో అంతర్గత పోరు తీవ్రంగా నడిచింది. బాల్‌ థాక్రే తమ్ముడి కొడుకు రాజ్‌ థాక్రే.. శివసేన పార్టీ బాధ్యతలు చేపట్టాలని ఆశించారు. కానీ తన రాజకీయ వారసుడిగా ఉద్ధవ్ పేరునే బాల్ థాక్రే ప్రకటించారు. దీంతో పార్టీలో రాజ్ థాక్రేకు ప్రాధాన్యత తగ్గడం మొదలైంది. దీంతో రాజ్‌థాక్రే 2005లో శివసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య హోరా హోరీ నడుస్తూనే ఉంది.  

ఏక్ నాథ్ షిండే  ఎవరు ? 

ఇప్పుడు ఏక్ నాథ్ షిండే రూపంలో మరో సంక్షోభం శివసేనను కుదిపేసింది. ఉద్ధవ్‌ థాక్రే సీఎం అయ్యాక.. కుమారుడు ఆదిత్య థాక్రేకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం షిండేకు నచ్చలేదు. పైగా శివసేనలో కింది స్థాయి నుంచి ఎదిగిన షిండేకి తనముందు పెరిగిన పిల్లాడు ఆదిత్యథాక్రే సలహాలివ్వడం, తన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆగ్రహం తెప్పించింది. మరోపైపు.. ఉద్ధవ్ థాక్రే పార్టీని టేకోవర్ చేయకముందు నుంచి ఏక్ నాథ్ షిండే శివసేనలో ఉన్నారు. పాలిటిక్స్ లోకి రాకముందు ఆటో రిక్షా నడుపుకునేవారు ఏక్ నాథ్ షిండే.  1980లో థానే జిల్లా అధ్యక్షుడి సూచనతో శివసేనలో చేరారు. 1997లో మొదటిసారి కార్పొరేటర్ అయిన షిండే.. ఆ తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగానూ పనిచేశారు. బాలా థాక్రేకు నమ్మిన బంటుగా ఉన్నారు ఏక్ నాథ్ షిండే. మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014లో గెలిచిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన కొడుకు శ్రీకాంత్ షిండే..  లోక్‌సభ ఎంపీగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌ గా ఉన్నారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. థానేలో ప్రముఖ నేతల్లో ఏక్ నాథ్ షిండే ఒకరు. అక్కడ పార్టీని బలోపేతం చేయడంలోనూ కీలకంగా ఉన్నారు. ఇంత  సీనియర్ అయిన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండటం లేదనే ఆవేదనతో శివసేనకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు సీఎం పదవి పొందారు. 

ప్రభుత్వం కూలిపోవడానికి చాలా కారణాలు 

ప్రస్తుతం మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు రెబల్స్. శివసేన అంటేనే.. కరుడుగట్టిన హిందూత్వానికి కేరాఫ్. ఐతే ఆ సిద్ధాంతాలను పక్కనపెట్టి.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో పొత్తుతో.. పార్టీ విలువలు పక్కపెడుతున్నారని షిండే ఆరోపించారు. మరోవైపు.. శివసేన పార్టీని స్థాపించిన బాల్ థాక్రే.. ఏనాడూ సీఎం పదవి ఆశించలేదు. పార్టీలో సమర్థులనుకున్న వారికే అవకాశం ఇస్తూ వెళ్లారు. కానీ ఉద్ధవ్ మాత్రం ఆ పని చేయకుండా తానే సీఎం పదవిలో కూర్చోవడం కూడా సీనియర్లు ఇబ్బందిగా ఫీలయ్యారు. గతంలో శివసేన,బీజేపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2019లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. సీఎం పదవి ఇవ్వలేదనే కారణంతో ఉద్ధవ్ థాక్రే తెగదెంపులు చేసుకున్నారు. అప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది బీజేపీకే కాదు.. బాల్ థాక్రే సిద్ధాంతాలతో ఉన్నవారికి నచ్చలేదు. దీనికితోడు గతంలో పార్టీపై తిరుగుబాటు చేసిన ఛగన్ భుజ్ బల్ ఇప్పుడు ఉద్ధవ్ సర్కారులో మంత్రిగా ఉండటం కూడా షిండేకు సహించలేదు. దీంతో తిరుగుబాటు జెండా ఎగరేసి..  సీఎం అయ్యారు. 

పెద్ద విషయమే కాదంటున్న శివసేన నేతలు

పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవడం పెద్ద విషయమే కాదంటున్నారు శివసేన నేతలంటున్నారు. గతంలోనూ చాలా మంది వెళ్లిపోయారని.. ఎందరు వెళ్లిపోయినా కొత్తవాళ్లు వస్తూనే ఉంటారని చెబుతున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తూనే ఉంటారని ధీమా వ్యక్తంచేస్తున్నారు. పార్టీని లేకుండా చేసే కుట్రలను అడ్డుకుంటామని చెబుతున్నారు. ఒక ఉద్యమనేపథ్యంతో పుట్టిన పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరిన ప్రతిసారీ భారీగానే నష్టం జరుగుతోంది. పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు.. నిత్యం జనంలో ఉండేవాళ్లే వెళ్లపోతుండటం సమస్య అయ్యింది. దీంతో చాలా కేడర్ ను శివసేన పోగొట్టుకోవాల్సి వచ్చింది. చగన్ భుజ్ బల్, ఆ తర్వాత నారాయణ్ రాణె, ఇప్పుడు ఏక్ నాథ్ షిండే.. ఇలా ముగ్గురు చాలా కీలక స్థాయిల్లో ఉన్నవారు.. వెళ్లిపోవడంతో పార్టీ ఇబ్బందులో పడింది. దీనికితోడు.. సొంత ఫ్యామిలీలోనే వచ్చిన చీలికతో పార్టీ కేడర్ కూడా చీలిపోయింది. అయినా.. వెనకడుగు వేసేది లేదంటోంది ఉద్ధవ్​ వర్గం.