
- విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు : కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అధ్యయనం చేస్తున్నామని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చెప్పారు. విద్యా వ్యవస్థలోని సమస్యల గురించి స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్ లీడర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించి రిపోర్ట్‌ను రెడీ చేస్తున్నామన్నారు. గురువారం పాలమూరు యూనివర్సిటీని సందర్శించిన ఆయన స్టూడెంట్లు, యూనియన్ లీడర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గట్టు మండలం అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉందన్నారు. విదేశాల్లో విద్యకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని, కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌ను విజిట్ చేశానని.. అక్కడ 14 మంది పీడీలు ఉంటే... పాలమూరు వర్సిటీలో ఒక్కరే ఉన్నారన్నారు. వర్సిటీ హాస్టల్‌లోని స్టూడెంట్లకు మంచి ఫుడ్ అందేలా చూస్తామన్నారు. ప్రతి స్టూడెంట్ స్పోకెన్ ఇంగ్లీష్‌తో పాటు కంప్యూటర్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని సంవత్సరాల తరబడి పాలించిన గత ప్రభుత్వాలు విద్యాశాఖ మీద ఒక్క సారి కూడా రివ్యూ చేయలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు సమీక్షలు నిర్వహిస్తోందన్నారు. అందరి నుంచి సేకరించిన అభిప్రాయాలను రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లు తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో పీయూ వీసీ జీఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ పూస రమేశ్‌బాబు, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కుమారస్వామి, సిబ్బంది విశ్వేశ్వరయ్య, చారకొండ వెంకటేశ్, జ్యోత్స్న, శివారెడ్డి, కె.ప్రవీణ, రవికాంత్, కరుణాకర్‌రెడ్డి, చావ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.