భువనగిరి చైర్మన్​, వైస్​చైర్మన్​ రాజీనామా

భువనగిరి చైర్మన్​, వైస్​చైర్మన్​ రాజీనామా
  •     అయినా తప్పని అవిశ్వాసం 
  •     ఇప్పటికే క్యాంప్‌‌‌‌నకు వెళ్లిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్లు 
  •     ఉత్కంఠ రేపుతున్న భువనగిరి మున్సి‘పాలిటిక్స్’

యాదాద్రి, వెలుగు: భువనగిరి మున్సిపాలిటీ అవిశ్వాసం ఉత్కంఠ కలిగిస్తోంది. నిన్నటి వరకూ మౌనంగా ఉన్న చైర్మన్​ ఆంజనేయులు, వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్య శనివారం తమ పదవులకు రాజీనామా ప్రకటించారు. అయితే రూల్స్​ప్రకారం కాకుండా ఒక రోజు ఆలస్యంగా రాజీనామా చేయడం చర్చనీయాంశం అయ్యింది.  దీంతో వాళ్లు రాజీనామా చేసినా.. ఈ నెల 23న అవిశ్వాసం మీటింగ్​యథాతథంగా నిర్వహించనున్నారు.  

క్యాంప్‌‌‌‌నకు వెళ్లిన కౌన్సిలర్లు

భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు, వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్యపై బీఆర్​ఎస్​ అసంతృప్తి కౌన్సిలర్లు 16 మంది తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. వారికి తోడు  కాంగ్రెస్​ 9, బీజేపీ ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో ఈ నెల 23న అవిశ్వాసం మీటింగ్​ నిర్వహిస్తామని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సభ్యులకు నోటీసులు ఇచ్చారు.  

ఈ పరిస్థితుల్లో చైర్మన్​, వైస్​ చైర్మన్లతో రాజీనామా చేయించి, తమ పార్టీలోని అసంతృప్తుల్లో ఇద్దరిని ఎన్నుకునేలా చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల  శేఖర్​రెడ్డి ప్లాన్​ చేశారు. అయితే  సమ్మతి, అసమ్మతి కౌన్సిలర్ల మధ్య రాజీ కుదరలేదు. బీఆర్ఎస్​ కౌన్సిలర్​ అజీమ్​ నేతృత్వంలో అసమ్మతి కౌన్సిలర్లు శుక్రవారం రాత్రి క్యాంప్‌‌‌‌నకు వెళ్లిపోయారు.  దీంతో అవిశ్వాసం తప్పదన్న ఉద్దేశంతో కమిషనర్​ నాగిరెడ్డికి చైర్మన్​, వైస్​ చైర్మన్​ రాజీనామా లేఖలను అందించారు. 

అయినా అవిశ్వాసం తప్పదు 

చైర్మన్​, వైస్​ చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేసినా అవిశ్వాసం మీటింగ్​నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -2019 తెలంగాణ  మున్సిపాలిటీ చట్టం ప్రకారం అవిశ్వాసం నోటీసులు అందుకొని మీటింగ్​ ఖరారైన మూడు రోజుల ముందు పదవులకు రాజీనామా చేయాలి.

ఈ లెక్కన చైర్మన్​, వైస్​ చైర్మన్లు 19(శుక్రవారం)న రాజీనామా చేస్తే లేఖను పరిగణలోకి తీసుకుంటారు. లేని పక్షంలో రాజీనామాను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 23న అవిశ్వాసం మీటింగ్​ జరుగుతుంది. రూల్స్​ ప్రకారం 24 మంది  కౌన్సిలర్లు హాజరైతేనే అవిశ్వాసం మీటింగ్​ నిర్వహిస్తారు. లేని పక్షంలో రెండుమార్లు చూసి వాయిదా వేస్తారు. మరో ఏడాది వరకూ అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉండదు. అప్పటిలోగా మున్సిపాలిటీల పదవీకాలమే ముగిసిపోతుంది. 

రాజీనామాపై 24 తర్వాతే నిర్ణయం

చైర్మన్​, వైస్​ చైర్మన్ల రాజీనామా లేఖను కలెక్టర్​ హనుమంతు జెండగేకు కమిషనర్​ నాగిరెడ్డి శనివారం రాత్రి అందించారు. 23న అవిశ్వాస మీటింగ్​ జరిగిన తర్వాత రాజీనామా విషయంలో ఈ నెల 24లోగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు మరోషాక్​

బీఆర్ఎస్‌‌‌‌కు మరోషాక్ తగిలింది. ఇప్పటికే నల్గొండ చైర్మన్​ సైదిరెడ్డిని గద్దె దింపడం, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు తిరుగుబాటు చేసి అవిశ్వాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మోత్కూర్​మున్సిపాలిటీలోనూ చైర్మన్​ తీపిరెడ్డి సావిత్రిపై బీఆర్​ఎస్, కాంగ్రెస్​ కౌన్సిలర్లను అవిశ్వాసం ప్రకటించారు. మోత్కూర్​లో 12 సీట్లకు గాను బీఆర్ఎస్​ ఏడుగురు, కాంగ్రెస్​ ఐదుగురు కౌన్సిలర్లు గెలిచారు.

చైర్మన్​గా తీపిరెడ్డి సావిత్రి, వైస్​ చైర్మన్​గా బొల్లేపల్లి వెంకటేశ్‌‌‌‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్​కు చెందిన ముగ్గురు బీఆర్​ఎస్​లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు తిరిగి కాంగ్రెస్​కు వచ్చారు. కాగా చైర్మన్ తీపి రెడ్డి సావిత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైస్​ చైర్మన్​ వెంకటేశ్​ సహా ఐదుగురు బీఆర్​ఎస్​, నలుగురు కాంగ్రెస్​ కౌన్సిలర్లు  కలిసి శనివారం కలెక్టర్​ హనుమంతు జెండగేకు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.