- జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ స్పష్టీకరణ!
- లోతుగా విచారిస్తం.. ఎవరినైనా పిలుస్తం
- ప్రజల నుంచి కూడా ఆధారాలు, ఫిర్యాదులు తీసుకుంటామని వెల్లడి
- ఈ నెల 9 తరువాత రాష్ట్రానికి రానున్నట్టు ప్రభుత్వానికి సమాచారం
హైదరాబాద్, వెలుగు : లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేండ్లలోనే కుంగిపోవడం చిన్న విషయం కాదని.. ఎంక్వైరీ సీరియస్‌గా ఉంటుందని ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేసినట్లు తెలిసింది. కాళేశ్వరంపై లోతుగానే ఎంక్వైరీ చేస్తామని చెప్పినట్టు సమాచారం. ఏదీ ఎందుకోసం చేశారనే కోణంలో ఎవరినైనా పిలిపించుకుని మాట్లాడుతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నెల 9 తర్వాత రాష్ట్రానికి రానున్నట్టు పేర్కొన్నారు.
ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు, విజ్ఞప్తులు, ఆధారాలను సేకరిస్తామన్నారు. ఇప్పటికే ప్రాథమిక వివరాలు తెప్పించుకున్న కమిషన్ చైర్మన్.. కట్టిన నాలుగేండ్లలోనే బ్యారేజీలు కుంగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఎంక్వైరీని వీలైనంత త్వరగానే పూర్తి చేస్తానని అయితే జూన్‌లోపు కాదని.. ఒకటి రెండు నెలలు అటు ఇటుగా కంప్లీట్చేయనున్నట్లు ప్రభుత్వానికి ఘోష్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టు కోసం ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారు? అప్పులు ఎలా తీసుకున్నారనే వివరాలు చూసిన ఆయన ‘‘లక్ష కోట్లు అంటే మాటలా.. ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా. అన్ని కోట్ల ప్రజాధనం ఏ మేరకు ఉపయోగ పడిందనే దానిపై సీరియస్‌గానే ఎంక్వైరీ ఉంటుంది. మధ్యలో ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ ను ఉపేక్షించేది లేదు. విచారణ సందర్భంగా కాగితాలపై సంతకాలు ఉన్నవాళ్లనే కాదని.. ఓరల్‌గా ఆదేశాలు ఇచ్చినవాళ్లను కూడా పిలిచి మాట్లాడుతాం’’ అంటూ ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం.
కాళేశ్వరం కోసం ఎవరెవరు ఎక్కడ పనిచేశారు?
రాష్ట్రానికి రానున్న జ్యుడీషియల్ కమిషన్‌కు సెక్యురిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏయే విధులు నిర్వర్తించారో ఆ అధికారుల డేటా మొత్తం కావాలని అడిగారు. సీఎస్, ఇరిగేషన్ సెక్రటరీలు, ఇరిగేషన్ మంత్రులుగా ఎవరు ఉన్నారనే వివరాలపైనా ఆరా తీసినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా పనిచేస్తున్న వాళ్ల వివరాలు కూడా తెప్పించుకున్నట్టు సమాచారం.