ఆసక్తిరేపుతున్న ‘చకిలం’ అడుగులు.. 

 ఆసక్తిరేపుతున్న ‘చకిలం’ అడుగులు.. 
  • ఏకమవుతున్న ఉద్యమకారులు
  •  ఆసక్తిరేపుతున్న ‘చకిలం’ అడుగులు.. 

నల్గొండ, వెలుగు : నల్గొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సర్దార్​చకిలం శ్రీనివాస్​రావు పేరుతో ఆయన తనయుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్​ తండ్రి పేరిట ఇటీవల చేపడుతున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. 1967లో జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన చకిలం శ్రీనివాస్​రావు రాజకీయ వారసుడిగా వచ్చిన అనిల్ కుమార్ అలుపెరగని పోరాటమే చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అనిల్ కుమార్​కు పార్టీలో సరైన గుర్తింపు లభించలేదు. ఆయన సమకాలీనులైన పార్టీ సీనియర్లు ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్నారు. కానీ అనిల్ కుమార్​కు రాజకీయంగా పదవులు వచ్చి చేజారిపోయాయి. నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాగా వివిధ కారణాల వల్ల అవకాశం దక్కకుండా పోయింది.

ఆ తర్వాత నామినేటేడ్​పదవులు ఆశించినా చివరకు బ్రాహ్మణ పరిషత్​సభ్యుడితోనే సరిపెట్టారు. దీంతో తీవ్ర అసంతృ ప్తికి గురైన ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన తండ్రి శ్రీనివాస్​రావు పేరుతో నల్గొండలో ఉద్యమకారులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా తన తండ్రి పేరు మీద శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆయన పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. సోమవారం నల్లగొండలో జరిగిన శ్రీనివాస్​రావు శతజయంతి ప్రోగ్రామ్ కు కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు శంకర్​నాయక్, చెరుకు సుధాకర్ తో సహా, బీఆర్ఎస్ లోని పలువురు అసంతృప్తులు కూడా హాజరయ్యారు. అయితే నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఎవరూ పాల్గొనలేదు. సోమవారం మరొవైపు నల్గొండలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి జగదీష్​ రెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే చకిలం అనిల్​చేపట్టిన శతజయంతి ఉత్సవాలవైపు స్థానిక ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్​రెడ్డి సహా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. 

రాజకీయ పునరేకీకరణ...

సర్దార్​చకిలం శ్రీనివాస్​రావు 1967, 1972లలో నల్గొండ ఎమ్మెల్యేగా కాంగ్రె స్​పార్టీ తరపున రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. తిరిగి 1983లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, మళ్లీ 1989 ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి జిల్లాలో రెడ్ల ఆధిపత్యం జరుగుతున్న రోజుల్లోనే చకిలం పాలిటిక్స్​కీరోల్​పోషించాయి. ఆయన అనుచరులుగా జిల్లాలో అనేక మంది రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించారు. నాటి శ్రీనివాస్​రావు ఆశయాలకు కొనసాగింపుగా మళ్లీ ఇప్పుడు అనిల్ కుమార్ రాజకీయ పునరేకీకరణకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ లో పార్టీ పదవులు ఆశించి భంగపడ్డ ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్లు, ఉద్యమకారులను ఏకతాటికి పైకి తీసుకొస్తున్నారు.

సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో సభలు పెట్టాలని ప్లాన్​చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యమకారులతో చర్చలు జరిపిన ఆయన రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమకారులను పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నారు. అనిల్​కమార్​వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్న బీఆర్ఎస్​లోని పలువురు ముఖ్యనేతలు, అసంతృప్తులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగానే బీఆర్ఎస్​ పట్టణ ప్రెసిడెంట్​పిల్లి రామరాజు యాదవ్ తో సహా పలువురు పార్టీ సీనియర్లు కార్యక్రమాలకు హాజరవుతున్నారు.