
హీరో అవ్వాలని..
1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో పుట్టారు చలపతిరావు. చదువు కంటే నాటకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో మద్రాస్ వెళితే సినిమా హీరో అవుతావని ప్రోత్సహించారు స్నేహితులు. అలా అప్పట్లోనే లక్ష రూపాయలు తీసుకుని మద్రాస్ ట్రైన్ ఎక్కారు. లగ్జరీ లుక్ కోసం కారు కొన్నారు. కానీ అది యాక్సిడెంట్ అవడం, డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తే ఆడకపోవడంతో ఉన్న డబ్బు ఖర్చయిపోయింది.
అప్పటికే కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్లంతా హీరో వేషాల కోసం ప్రయత్నిస్తుండడంతో తనకు హీరో వేషం రాదని విలన్ వేషాల కోసం ప్రయత్నించారు. అవి కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఎన్టీఆర్‌ను కలిశారు. మొదట్లో అవకాశాలు దొరకడం కష్టమని చెప్పిన ఎన్టీఆర్.. చలపతిరావు మొండితనం చూసి ‘కథానాయకుడు’లో మునిసిపల్ కమిషనర్ పాత్ర ఇచ్చారు.
ఎన్టీఆర్ మనిషిగా..
ఎన్టీఆర్‌కు సన్నిహితుడుగా చలపతిరావుకు ముద్రపడింది. దాంతో ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కచ్చితంగా ఆయనకు అవకాశాలు ఇచ్చేవారు. అయితే ఇతర చిత్రాల్లో అవకాశాలు వచ్చేవి కావు. అలా ఐదారేళ్లు ఎన్.టి.రామారావు చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు చలపతిరావు. ఎన్టీఆర్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన ‘దాన వీర శూర కర్ణ’లో ఆయన మూడు పాత్రలు పోషిస్తే.. చలపతిరావు ఐదు క్యారెక్టర్స్ చేశారు. ఆ సమయానికి ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడంతో చలపతిరావుతో ఐదు పాత్రలు చేయించారు ఎన్టీఆర్. ఆ సినిమాతో చలపతిరావుకు బ్రేక్ వచ్చింది.
యమగోల, యుగపురుషుడు, అక్బర్ సలీం అనార్కలి, జస్టిస్ చౌదరి లాంటి ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నటించిన చలపతిరావు.. ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో మాత్రం అనుబంధం కొనసాగుతూ వచ్చింది. యూఎస్ ట్రిప్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చలపతిరావు మరణవార్త విని షాకయ్యారు. వెంటనే రవిబాబుకు వీడియో కాల్ చేసి.. ‘లే బాబాయ్ లే..’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నందమూరి ఫ్యామిలీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని, తాతగారి రోజుల నుంచి చలపతి బాబాయ్ తమకు ఎంతో ఆప్తుడని ఎన్టీఆర్ సంతాపం తెలిపారు.
విలన్‌గా..
తన కెరీర్ మొత్తంలో 94 రేప్ సీన్స్‌లో నటించారు చలపతిరావు. సత్యనారాయణ, రావుగోపాలరావు లాంటి సీనియర్స్ విలన్స్‌గా నటించిన సినిమాల్లోనూ రేప్ సీన్ అనగానే చలపతిరావునే పిలిచేవారు. విలన్‌గా కంటే కూడా మెయిన్ విలన్ కింద పనిచేసే రౌడీ పాత్రల్లోనే ఆయన ఎక్కువగా నటించారు. సినిమాల్లో విలన్ వేషాలు వేసినప్పటికీ భార్యకు ఇచ్చిన మాట కోసం నిజజీవితంలో మాత్రం మందు, సిగరెట్ లాంటి వ్యసనాల జోలికెళ్లలేదు.పైగా ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం కూడా ఆ అలవాట్లను దరిచేరనివ్వలేదు.
నిర్మాతగా..
ఓవైపు నటుడిగా కొనసాగుతూనే, నిర్మాతగానూ మారారు చలపతిరావు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్లపంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి లాంటి చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత తీసిన కొన్ని టీవీ సీరియల్స్‌లో నష్టం రావడం, నటుడిగా ఎక్కువ బిజీ అవడంతో చిత్రనిర్మాణం ఆపేశారు.
కెరీర్ టర్న్ చేసిన ‘నిన్నే పెళ్లాడతా’..
మొదట్లో విలన్ పాత్రలు ఎక్కువ చేసినా ఆ తర్వాత కమెడియన్, బాబాయ్ పాత్రలతోనూ మెప్పించారు. ముఖ్యంగా ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విలన్ ఇమేజ్ ఉన్న చలపతిరావుకి ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో తండ్రి క్యారెక్టర్ ఇచ్చారు కృష్ణవంశీ. ఆ తర్వాత నుండి తండ్రి, బాబాయి పాత్రలకు ఆయన కేరాఫ్ అయ్యారు. ఆది, సింహాద్రి, సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
మంచి తండ్రిగా ..
చలపతి రావు సినిమాల్లోకి వచ్చిన ఐదేళ్లకే భార్య చనిపోయింది. అప్పటికి ఆయన వయసు 28. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అయినా మరో పెళ్లి చేసుకోలేదు. తల్లి సాయంతో పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. ఆయన కొడుకు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కూతుళ్లిద్దరూ బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక తన చివరి సినిమా కూడా కొడుకు డైరెక్షన్‌లోనే నటించారు చలపతిరావు. ఐదు రోజుల క్రిందటే ఆ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు.
చికెన్ బిర్యాని ఇష్టంగా తిని..
చలపతిరావు జీవితంలో ఎలా హ్యాపీగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండేవారో అలానే ప్రశాంతంగా వెళ్లిపోయారు. ‘రాత్రి చికెన్ కూర, బిర్యాని తిని ఆ ప్లేట్‌ను ఇచ్చి వెనక్కివాలిపోయారు. అంత సింపుల్‌గా, హ్యాపీగా వెళ్లిపోయారు. మా నాన్నకు రామారావు గారు, ఆహారం, హాస్యం ఈ మూడే చాలా ఇష్టం. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. అలానే ఇప్పుడు ఒక్క క్షణంలో ఎలాంటి బాధ లేకుండా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు’ అని చలపతిరావు కొడుకు రవిబాబు తెలిపారు.