బీజేపీ క్యాండిడేట్​ ఫోన్లు చేయడం సిగ్గుచేటు : చల్లా వంశీచంద్ రెడ్డి

బీజేపీ క్యాండిడేట్​ ఫోన్లు చేయడం సిగ్గుచేటు : చల్లా వంశీచంద్ రెడ్డి

పాలమూరు, వెలుగు: బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్  కార్యకర్తలకు ఫోన్లు చేసి ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరడం సిగ్గుచేటని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్  ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్రౌన్  గార్డెన్స్  ఫంక్షన్  హాల్​లో బుధవారం హన్వాడ మండలానికి చెందిన మాజీ సర్పంచులు, బీఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీకే అరుణ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్నారు.

డీకే అరుణ తమకు ఫోన్  చేశారని పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలిపారని, ఒక పార్టీ అభ్యర్థిగా ఉండి మరో పార్టీ కార్యకర్తలను మద్దతు ఇవ్వాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను ఏ ఒక్క బీజేపీ నాయకుడు, కార్యకర్తకు ఫోన్  చేసి ఇలా చేస్తే ముక్కు నేలకు రాస్తానని, కాంగ్రెస్  అభ్యర్థిగా పోటీ చేయనన్నారు. మోదీ వచ్చినా కాంగ్రెస్  నాయకులు, కార్యకర్తలు డబ్బులకు అమ్ముడుపోరని, పార్టీని వదిలిపెట్టరని తెలిపారు. బీఆర్ఎస్  ఎంపీ అభ్యర్థి గతంలో ఎంపీగా ఉండి చేసిందేమిలేదని, చాలా మందికి ఆయన ఎంపీ అన్న విషయమే తెలియదన్నారు. ఎన్నికల్లో హన్వాడ మండలం నుంచి 10 వేల మెజార్టీ వస్తే తాను ఎంపీగా గెలుపొందిన తర్వాత మండలానికి పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి ప్రతీ ఎకరానికి నీళ్లు తీసుకొస్తానని చెప్పారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాదుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్ణం కట్టాలని కోరారు. టీవీలో కనిపించే మోదీ అభివృద్ధి చేయరని, ఏ నాయకుడు, కార్యకర్తకు మోదీ దర్శనం దొరకదని, ఇక సామాన్యుడి సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, వైస్  చైర్మన్ షబ్బీర్, నాయకులు వినోద్ కుమార్, ఎం సురేందర్ రెడ్డి, ఎన్పీ వెంకటేక్, సిరాజ్ ఖాద్రీ, చంద్రకుమార్ గౌడ్, హనీప్ అహ్మద్, విజయ్ కుమార్, లక్ష్మణ్ గౌడ్, ఫయాజ్, అజ్మత్ లీ, నర్సింహారెడ్డి, మహేందర్, కృష్ణయ్య పాల్గొన్నారు.