కష్టపడ్డవారికే పార్టీ పదవులు : చల్లా వంశీచంద్

కష్టపడ్డవారికే పార్టీ పదవులు : చల్లా వంశీచంద్

ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు శాఖలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ సీడబ్ల్యూయూసీ శాశ్వత ఆహ్వానితులు, ఏఐసీసీ మాజీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పార్లమెంట్ ఇన్​చార్జ్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గ ఇన్​చార్జ్ చక్కిలం రాజేశ్వరరావు, వైరా, సత్తుపల్లి ఇన్​చార్జ్ దైదా రవీందర్, అశ్వారావుపేట ఇన్​చార్జ్ పీసరి మహిపాల్ రెడ్డి, బత్తిన శ్రీనివాస్ తో  కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలకు సంస్థాగత వ్యవహారాల పరిశీలకులుగా తమను పార్టీ హైకమాండ్​ పంపినట్లు తెలిపారు.

 ఈనెల 12లోపు ప్రతీ శాసనసభ నుంచి అర్హులైన ఇద్దరు చొప్పున పేర్ల జాబితాను ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కష్టపడి  పని చేశారో వారికి తగిన గుర్తింపు దక్కుతోందన్నారు. నామినేటెడ్ పోస్టుల ఎంపికకు కూడా ఇద్దరు చొప్పున పేర్లను ఈనెల 15 లోపు ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు 50 శాతం అవకాశం కల్పిస్తామన్నారు. పదవుల ఎంపికలో జిల్లా అధ్యక్షుడు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జిల్లా పార్టీ కార్యాలయంలో ఉండి అందరి అభిప్రాయాలు సేకరించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మహబూబాద్ ఇన్​చార్జ్ పోట్ల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం సిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ పాల్గొన్నారు.