కొవిడ్​ లోన్ పథకానికి సవాలక్ష సమస్యలు

కొవిడ్​ లోన్ పథకానికి సవాలక్ష సమస్యలు
  • స్మైల్ పథకానికి సవాలక్ష సమస్యలు
  • కొవిడ్​ లోన్ ​అప్లికేషన్లకు ఇవాళ్టితో ముగియనున్న గడువు
  • బాధితులకు అందని సర్టిఫికెట్లు
  • కరోనా డెత్స్ ​తక్కువ చూపడంతో నష్టపోనున్న కుటుంబాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రాజీవ్ నగర్​కు చెందిన ప్రైవేట్​ ఉద్యోగి షేక్​షరీఫ్(31) పది రోజుల క్రితం కరోనాతో చనిపోయాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్​ తీవ్రం కావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందాడు. అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించారు. ఇంటి భారాన్ని మోసే కుటుంబ పెద్ద చనిపోవడం, మృతుడి పిల్లలిద్దరూ చిన్నవారు కావడంతో ఇప్పటివరకు డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు. బీసీ దూదేకుల కులానికి చెందిన ఈ కుటుంబం స్మైల్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే డెత్ సర్టిఫికెట్ అవసరం. ఇప్పటికిప్పుడు సర్టిఫికెట్​ఎలా తెచ్చుకోవాలో తెలియక మృతుని భార్య బేబీ నూరిన్​ ఇబ్బంది పడుతున్నారు. 

ఖమ్మం, వెలుగు: కరోనా కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఎస్సీ, బీసీ కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మైల్’ లోన్​ స్కీమ్ తీసుకొచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఫైనాన్స్ ​డెవలప్​మెంట్ 
కార్పొరేషన్ల ద్వారా రూ.4 లక్షల లోన్, రూ. లక్ష సబ్సిడీతో మొత్తం రూ. 5 లక్షల సహాయాన్ని అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సెంటర్​నుంచి వచ్చిన గైడ్​లైన్స్​తో ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్​ జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాల కలెక్టర్లు ఈ నెల 26లోపు బీసీ కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకోవాలంటూ ఈ నెల 24న స్టేట్ మెంట్లు ఇచ్చారు. అప్లై చేసుకునేందుకు కేవలం రెండ్రోజులు మాత్రమే టైమ్​ ఇవ్వడం మీద బీసీ సంఘాలు, బాధిత కుటుంబాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కరోనా డెత్స్​ తక్కువ చూపిన్రు 
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ కరోనా పాజిటివ్​ కేసులతో పాటు డెత్స్​ను తక్కువ చేసి చూపించిందనే ఆరోపణలున్నాయి. కొవిడ్​ కారణంగా ఇప్పటివరకు 3,607 మంది చనిపోగా, ఈ సంఖ్య ఇంతకు పది రెట్లు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కరోనా మృతులుగా చూపించలేదు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత గుండెపోటు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్​ కారణంగా చనిపోయిన వారిని నార్మల్ ​డెత్స్​గానే చూపారు. ఇలా అర్హులైన వారిని కూడా కొవిడ్ ​మృతుల జాబితాలో చేర్చకపోవడంతో వారంతా ఇప్పుడు కేంద్ర పథకానికి అనర్హులయ్యారు.  మరోవైపు ఇటీవల రెండో విడత కొవిడ్ సమయంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులు చాలామంది లాక్​ డౌన్​ కారణంగా డెత్ సర్టిఫికెట్లను తీసుకోలేకపోయారు. ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు కరోనా కారణంగా చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్​తో పాటు క్యాస్ట్, రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్నట్లు ఇన్​కమ్​ సర్టిఫికెట్​ను తప్పనిసరి చేస్తూ ఆఫీసర్లు ఆదేశాలిచ్చారు. గడువు మాత్రం రెండు రోజులే ఇవ్వడంతో ఇప్పటికిప్పుడు ఆయా సర్టిఫికెట్లు ఎలా తెచ్చుకోగలుగుతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ అధికారులు మాత్రం గడువులోగా అర్హులైన అందరి వివరాలు మండలాల అధికారుల ద్వారా తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. గడువు పెంపు అంశం తమ పరిధిలో లేదని, ధ్రువీకరణ పత్రాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు సర్టిఫికెట్లు ఎలా తెచ్చుకోవాలె
కరోనాతో చికిత్స పొందుతూ రెండు వా రాల క్రితం నా చెల్లెలి భర్త షరీఫ్​ చనిపోయిండు. మొదట సత్తుపల్లి ఆస్పత్రిలో, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకున్నంక హైదరాబాద్​కు తీసుకెళ్లినా బతకలేదు. స్మైల్ పథకం కింద అప్లై చేసుకునేందుకు ఇప్పటికిప్పుడు డెత్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో అర్థమైతలేదు.
‑ ఆయేషా నూరిన్, మృతుడు షరీఫ్ బంధువు

26లోపు వివరాలు ఇవ్వాలి 
స్మైల్ పథకం గురించి ఈ నెల 23న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్క్యులర్​వచ్చింది. దాన్ని వెంటనే జిల్లా కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి ఈ నెల 24న పత్రికా ప్రకటన విడుదల చేశాం. ఈ నెల 26 వరకు గడువు ఉంది. ఈలోగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పెంచే అంశం మా పరిధిలో లేదు. 
- గుడికందుల జ్యోతి, బీసీ కార్పొరేషన్​ ఈడీ 

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అర్హులకు అన్యాయం
ఈ నెల 7న కేంద్ర ప్రభుత్వం నుంచి పథకం నోటిఫికేషన్​ వచ్చినా, ఈ నెల 23 వరకు కలెక్టర్లకు ఆదేశాలివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది. కేవలం రెండ్రోజుల గడువు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అర్హులకు అన్యాయం చేయడమే. దరఖాస్తు గడువును జులై నెలాఖరు వరకు పొడిగించాలి. కరోనా సోకిన తర్వాత చనిపోయిన వారికి కరోనా మృతులుగా డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి. 
- శింగు నర్సింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి