ఉత్కంఠకు తెర.. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం

ఉత్కంఠకు తెర.. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం

జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఉత్కంఠకు తెరపడింది. JMM నేత చంపయీ సోరెన్ రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో 12 గంటల 15 నిమిషాలకు గవర్నర్  సి.పి.రాధాకృష్ణన్ చంపై సోరెన్ తో  సీఎంగా ప్రమాణం చేయించారు.  అలాగే, కాంగ్రెస్‌కు చెందిన ఆలంగీర్ ఆలం, RJD సత్యానంద్ భోక్తాలు జార్ఖండ్ క్యాబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.

మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్ లో కొత్త సర్కారు ఏర్పాటుపై  అయోమయం నెలకొంది. దీంతో 43 మంది MLA లను  కాపాడుకునేందుకు JMM, RJD, కాంగ్రెస్  కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కూటమి ఎమ్మెల్యేలను క్యాంప్ కు కూడా తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో  JMM శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ గవర్నర్  సి.పి.రాధాకృష్ణన్  ను కలిశారు.

తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు చంపై  సోరెన్ . దీంతో ఈరోజు సీఎంగా చంపై సోరెన్ ను  ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్. అయితే, చంపై సోరెన్ కొత్త ప్రభుత్వం కొనసాగాలంటే..  10 రోజుల్లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.