తెలంగాణ జాబ్ స్పెషల్ : గాంధీ తొలి సత్యాగ్రహాలు

తెలంగాణ జాబ్ స్పెషల్ :  గాంధీ తొలి సత్యాగ్రహాలు

1919 నుంచి 1947 వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక నాయకుడు మోహన్​ దాస్​ కరంచంద్ గాంధీ. అందుకే భారత జాతీయోద్యమ చరిత్రలో 1919 నుంచి 1947 వరకు గాంధీ శకం లేదా గాంధీ యుగంగా అభివర్ణిస్తారు. అతివాదులు, మితవాదులు లక్ష్య సాధనలో విఫలమైనా గాంధీజీ నాయకత్వంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించింది. దక్షిణాఫ్రికాలో 1883 నుంచి 1915 వరకు అనేక ఉద్యమాలు, సత్యగ్రహాలు చేపట్టిన గాంధీ 45 సంవత్సరాల వయస్సులో 1915 జనవరి 9న స్వదేశానికి తిరిగి వచ్చారు. అహ్మదాబాద్​లోని సబర్మతి వద్ద ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని 1916 నుంచి 1936 వరకు అక్కడే నివసించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వార్దా సమీపంలో సేవాగ్రామ్​ అనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 

చంపారన్​ సత్యాగ్రహం

ఇది భారతదేశంలో మహాత్మా గాంధీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం. బిహార్​లోని చంపారన్​ జిల్లాలో జరిగిన ఈ ఉద్యమం భారత రైతాంగ ఉద్యమాలన్నింటిలో  ఉన్నతమైంది. ఈ ప్రాంతంలో తీన్​కతియా పద్ధతి అమలులో ఉండటంతో ప్రతి రైతు తాను సాగుచేస్తున్న భూమిలో 3/20వ వంతు భూమి బలవంతంగా నీలిమందు సాగు కోసం కేటాయించేవారు. ఈ సాగు చేసే రైతులు స్థానిక జమీందార్లకు షరాబేషి లేదా తవాన్​ పన్నును చెల్లించాల్సి వచ్చేది. షరాబేషి అంటే శిస్తు పెంచడం, తవాన్​ అంటే ఏక మొత్తం  నష్టపరిహారం చెల్లించడం. రాజ్​కుమార్​ శుక్లా ఆహ్వానం మేరకు గాంధీ చంపారన్​లో నీలిమందు సాగు చేసిన రైతుల స్థితిగతుల విచారణకు చంపారన్​ వెళ్లి ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమంలో గాంధీతోపాటు జె.బి.కృపలాని, బాబు రాజేంద్రప్రసాద్​, మహాదేవ్​ దేశాయ్​, మజహర్​–ఉల్​–హక్​, నరహరి పారిక్​ వంటి నాయకులు కూడా పాల్గొన్నారు. 1916లో జరిగిన ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ సమావేశంలో గాంధీ రైతు నాయకులైన బ్రిజ్​కిషోర్​, రాజ్​కుమార్​ శుక్లాతో కలిసి ఉద్యమాన్ని నడపాలని భావించాడు. 1917 ఏప్రిల్​ 10న ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమానికి తలొగ్గి 1917 మే 29న గాంధీని బిహార్​ గవర్నర్​ ఆహ్వానించి నీలిమందు రైతుల సమస్యల పరిష్కారాల గురించి ఫ్రాక్స్​యాక్​ కమిటీని ఏర్పరచి ఆ కమిటీకి గాంధీని కార్యదర్శిగా నియమించాడు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తిన్​కతియా విధానం రద్దయింది. చంపారన్​ సత్యాగ్రహంతో రైతు ఉద్యమాలు జాతీయోద్యమంలో భాగమయ్యాయి. 

అహ్మదాబాద్​ సత్యాగ్రహం

అహ్మదాబాద్​లోని మిల్లు కార్మికుల తరఫున 1918లో గాంధీజీ ఉద్యమాన్ని చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు మిల్లు యాజమాన్యం బోనస్​లు ఇవ్వలేదు. అలాగే 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు అహ్మదాబాద్​ విడిచి తమ గ్రామాలకు వెళ్లిపోయినప్పుడు వారిని ఆకర్షించడానికి మిల్లు యజమానులు వారి వేతనాన్ని 75శాతం పెంచారు. కాని ప్లేగు వ్యాధి అంతరించాక యజమానులు పూర్వపు వేతనమే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో కార్మికులు, యజమానుల మధ్య ఘర్షణ మొదలైంది. అనసూయ బెన్​, సారాబాయ్​, ఆమె సోదరుడు అంబాలాల్​ సారాబాయ్​ పిలుపు మేరకు గాంధీ మిల్లు కార్మికుల తరఫున ఉద్యమాన్ని చేపట్టి 1918లో అహ్మదాబాద్​ టెక్స్​టైల్​ లేబర్​ యూనియన్​ అనే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ 1918 మార్చి 26న తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష ఫలితంగా మిల్లు యజమానులు, కార్మికుల జీతాలను 35శాతం పెంచడానికి అంగీకరించారు. మిల్లు యజమానులకు, కార్మికులకు జరిగిన ఘర్షణలో ఆనందశంకర ధృవ మధ్యవర్తిగా ఉన్నాడు. 

ఖేడా సత్యాగ్రహం

ఈ సత్యాగ్రహం గుజరాత్​లోని ఖేడా జిల్లా 1918 మార్చి 22 నుంచి జూన్​ 6 వరకు కొనసాగింది. ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు కారణంగా పంట దిగుబడి 25శాతం కంటే తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ వసూలు చేయరాదని రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా బ్రిటిష్​వారు దానిని పాటించకుండా రైతులను హింసించి రెవెన్యూ వసూలు చేసే ప్రయత్నం చేశారు. దీన్ని నిరసిస్తూ మోహన్​లాల్​ పాండ్య అనే వ్యక్తి మొదటగా ఉద్యమాన్ని చేపట్టాడు. కాని తర్వాత వల్లభాయి పటేల్​, ఇందూలాల్​ యాజ్ఙిక్​ సహాయంతో గాంధీజీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. గాంధీజీ తన అధ్యక్షతన గుజరాత్​ సభ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు ఖేడాలో రెవెన్యూ వసూలు మినహాయింపు ఇచ్చారు. 

దక్షిణాఫ్రికాలో పోరాటాలు 

దక్షిణాఫ్రికాలో స్థిరపడిన పోరుంబందకు చెందిన దాదా అబ్దుల్లా సేఠ్​ తరఫున వాదించడానికి లీగల్​ అడ్వైజర్​గా 1893లో గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడ భారతీయ ఓటు హక్కు కోసం పోరాటం జరిపి నటాల్​ రాష్ట్రంలో విజయం సాధించారు. అక్కడే 1894లో నటాల్​ ఇండియన్​ కాంగ్రెస్​ అనే సంస్థను స్థాపించారు.

దక్షిణాఫ్రికాలో బాలస్వామి అనే కూలీపై బ్రిటిష్​ వారు దాడి చేయగా గాంధీ ఈ విషయం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి బ్రిటిష్​ వారిని జైలుకు పంపాడు. తత్ఫలితంగా గిర్మిటియ సోదరుడిగా పిలువబడ్డారు. 

  • 1894లో దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులపై జరుగుతున్న అత్యాచారాలు తొలగించడానికి పోరాడారు. 
  • 1897లో గాంధీజీపై కూడా డర్బన్​లో శ్వేత జాతీయులు దాడి చేశారు. 
  • 1903లో గాంధీ స్థాపించిన ఇండియన ఒపీనియన్​ అనే పత్రికలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులపై అనేక వ్యాసాలను రచించి ప్రచురించాడు. కారణం 1906లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం నల్లచట్టంగా పేర్కొనే ఏషియాటిక్​ లా అమెండ్​మెంట్​ చట్టాన్ని రూపొందిస్తూ భారతీయుల వేలిముద్రలను ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్టర్​ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ ప్రప్రథమంగా తన నూతన రాజకీయ అస్త్రం సత్యాగ్రహాన్ని ప్రయోగించారు.

 ట్రాన్స్​వాల్​ ఇమిగ్రేషన్​ చట్టం 1907లో ఆమోదింపబడగా నాటాల్​ నుంచి ట్రాన్స్​వాల్​ రాష్ట్రంలోకి భారతీయుల ప్రవేశాన్ని నిషేధిస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1913లో క్రైస్తవేతర వివాహాలు చెల్లవంటూ దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశాడు. హిందూ సంప్రదాయబద్ద వివాహాలను గుర్తించాలని మళ్లీ సత్యాగ్రహం చేపట్టాడు. జూలు జాతి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధంలో గాయపడిన వారికి గాంధీజీ అంబులెన్స్​ ఫోర్స్​ సేవ చేసినందుకు దక్షిణాప్రికా ప్రభుత్వం కైజర్​ ఇ హింద్​ అనే బిరుదును బహూకరించింది. న్యూజికాల్​ గని కార్మికులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి మూడు పౌండ్ల ప్రత్యేక పన్నును చెల్లించాల్సి వచ్చేది. ఈ పన్నును వ్యతిరేకిస్తూ గాంధీజీ ఉద్యమించాడు. దక్షిణాఫ్రికాలో ఒప్పంద కార్మిక వ్యవస్థ రద్దు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాడు.  

బిరుదులు: 

గాంధీజీని జాతిపిత అని సుభాష్​చంద్రబోస్​ పిలిచాడు. మహాత్మ అని రవీంద్రనాథ్​ ఠాగూర్​ పిలిచాడు. బాపూజీ అని జవహర్​లాల్​ నెహ్రూ పిలిచాడు. కైజర్​ – ఎ – హింద్​ (1915) బోయర్​ యుద్ధ సమయంలో దక్షిణాఫ్రికాలో బ్రిటిష్​ ప్రభుత్వానికి యుద్ధ కృషిలో సైనిక దళాల్లో ప్రజలు చేరడంలో పూర్తి సహాయం అందించినందుకు బ్రిటిష్​ వారు ప్రదానం చేశారు.
 

గాంధీ స్థాపించిన పత్రికలు: 

యంగ్​ ఇండియా – ఇంగ్లీష్​ పత్రిక
హరిజన్​ – గుజరాతీ పత్రిక
నవజీవన్​ – గుజరాతీ మాస పత్రిక    
ఒండియన్​ ఒపీనియన్​ – ఇంగ్లీష్​ (దక్షిణాఫ్రికాలో 1903లో ప్రారంభించారు)

పుస్తకాలు: 

సత్యాగ్రహ (దక్షిణాఫ్రికా)
కాన్సెప్ట్​ ఆఫ్​ సెల్ఫ్​ రూల్​
హింద్ స్వరాజ్​
ఇండియన స్ట్రగుల్​
ది ఎర్రవాడ మందిర్​