జనవరి 1 నుంచి కొత్త ఓటు నమోదుకు చాన్స్

జనవరి 1 నుంచి కొత్త ఓటు నమోదుకు చాన్స్
  • జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ 

 హైదరాబాద్, వెలుగు: జనవరి 1 నుంచి కొత్త ఓటరు నమోదుకు అప్లయ్ చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు.  బుధవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో రాజకీయ పార్టీ ప్రతినిధులతో  స్పెషల్ సమ్మరీ రివిజన్--–2024లో భాగంగా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

జనవరి 1 నుంచి  ceotelangana.nic.in ఆన్​లైన్ ద్వారా,  ఆఫ్​లైన్​లో బీఎల్వోలకు 18 ఏళ్లు నిండినవారు  ఓటరు జాబితాలో పేరు లేనివారు  కొత్తగా, జాబితాలో తప్పుల సవరణకు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఈ నెల 20 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఓటరు జాబితా, ఎపిక్ కార్డులో తప్పులు పరిశీలిస్తారన్నారు.  ఎపిక్ కార్డుపై ఫొటో క్లియర్​గా ఉండేలా చర్యలు తీసుకుంటారన్నారు. జనవరి 1న ప్రతిపాదిత సప్లిమెంటరీ ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్​ రోల్​ను సిద్ధం చేస్తామన్నారు. అదే నెల 6న ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరోల్​ను ప్రచురిస్తామని తెలిపారు. 

ఫిబ్రవరి 8న తుది ఓటర్​ జాబితా

క్లైమ్స్, ఆబ్జెక్షన్లను జనవరి 6 నుంచి జనవరి 22 వరకు స్వీకరించి ఫిబ్రవరి 2 నాటికి క్లియర్ చేస్తామని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 8న విడుదల చేస్తామన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేందుకు ఫామ్ –8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. షిఫ్టెడ్, డూప్లికేట్, ఓటర్లను పరిశీలించి  స్పష్టమైన ఓటరు జాబితా  తయారు చేసేందుకు ఈఆర్వోలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఈఆర్వోలు ఓటరు జాబితా ఆధారంగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటి నంబర్లను వెరిఫై చేస్తారని, ఒకే కుటుంబంలో ఆరు మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే వాటిని రీవెరిఫై చేస్తామని తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇతర పోలింగ్ కేంద్రాల్లో నమోదు అయిన ఓటర్లను, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను, ఫొటో మిస్ మ్యాచ్, ఇంటి నెంబర్లను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని తెలిపారు.

ఇంటి నెంబర్ వారీగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 11 వరకు 15 నియోజకవర్గాల్లో వివిధ రకాల ఫారమ్​ ద్వారా వచ్చిన దరఖాస్తులను కమిషనర్ వివరించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులు హాజరయ్యారు.

వెంగళరావు పార్కులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

జలగం వెంగళరావు పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జలగం వెంగళరావు పార్కును సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పార్కులో యోగా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. చెరువును పరిశీలించిన ఆయన.. క్లీన్​గా ఉంచాలన్నారు.

సందర్శకులు సేదతీరేందుకు పార్కులో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కమిషనర్ వెంట అర్బన్ బయో డైవర్సిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రె, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు, అర్బన్ బయో డైవర్సిటీ జాయింట్ డైరెక్టర్ సునంద పాల్గొన్నారు.