చండీగఢ్లో వినూత్నంగా హర్‌ ఘర్‌ తిరంగ వేడుకలు

చండీగఢ్లో వినూత్నంగా  హర్‌ ఘర్‌ తిరంగ వేడుకలు

దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చండీగఢ్లో హర్‌ ఘర్‌ తిరంగ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. అతి పెద్ద జాతీయ జెండా రూపంలో మానవహారంగా నిలబడి గిన్నీస్ రికార్డు సృష్టించారు. చండీగఢ్‌ విశ్వవిద్యాలయంలో 16 ఎకరాల క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 5,885 మంది జాతీయ జెండా రంగుల వస్త్రాలు ధరించి మానవహారంగా నిలుచున్నారు. ఎన్‌ఐడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ  కార్యక్రమంలో కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి, చండీగఢ్ యూనివర్శిటీ ఛాన్సలర్ సత్నామ్‌ సింగ్‌ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. 

మానవహారం జాతీయ జెండా గిన్నీస్ బుక్  రికార్డు సాధించింది. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ డేటా ఎడ్యుకేటర్ స్వప్నిల్ దంగరికర్ ధృవీకరించారు. గతంలో ఈ రికార్డు అబుదాబిలో GEMS స్కూల్ సాధించారని చెప్పారు. UAEలో 2017లో 4130 మందితో ఆ దేశ జెండా రెపరెపలాడించారని వివరించారు. ఆ రికార్డును చండీగఢ్ కాలేజ్ విద్యార్థులు తిరగరాశారని తెలిపారు. 5,885 మంది చిన్నపిల్లలు, యువతీ యువకులు  ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ పిక్చర్ ఆఫ్ ఎ వేవింగ్ నేషన్‌వైడ్ ఫ్లాగ్‌ను రూపొందించారని పేర్కొన్నారు. ఈ  సందర్భంగా చండీగఢ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ విద్యార్థుల కృషిని అభినందించారు.