రాష్ట్రం విడిపోయింది.. అయినా నా రికార్డును ఎవరూ మార్చలేరు : చంద్రబాబు 

రాష్ట్రం విడిపోయింది.. అయినా నా రికార్డును ఎవరూ మార్చలేరు : చంద్రబాబు 

హైదరాబాద్ను టెక్ హబ్గా తీర్చిదిద్దడంలో తన పాత్ర గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘విజన్ 2020’’ అని తాను ఆనాడు చెబితే వెకిలిగా మాట్లాడిన వాళ్లంతా.. ఆ విజన్ వల్ల అవతరించిన టెక్ హైదరాబాద్ ను చూసి కాలక్రమంలో కనువిప్పు పొందారని పేర్కొన్నారు. ఇప్పుడు తాను విజన్ 2029 తో ముందుకు పోతున్నానని చెప్పారు. హైదరాబాద్ లోని ఐఎస్బీలో జరిగిన 20 సంవత్సరాల వసంతోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ 20 ఏళ్ల తర్వాత నన్ను గుర్తుపట్టకున్నా  నేను హ్యాపీ!!  రాష్ట్రం విడిపోయింది.. అయినా నా రికార్డును ఎవరూ మార్చలేరు’’ అని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బిల్ గేట్స్ తో తన తొలి మీటింగ్ కు సంబంధించిన పలు విశేషాలను ఈసందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  ‘‘బిల్ గేట్స్ ఇండియాకు వస్తున్నారని తెలుసుకొని ఆయన అపాయింట్మెంట్ కోసం నేను ట్రై చేశాను.  నేను ఆయన అపాయింట్మెంట్ అడిగితే.. రాజకీయ నాయకులతో నాకేం పని అని బిల్ గేట్స్ అన్నారట.  ఎట్టకేలకు నాకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. కేవలం 10 నిమిషాల కోసమే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే హైదరాబాద్ ను టెక్  హబ్ గా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే బిల్ గేట్స్ ఆసక్తిగా విన్నారు. దీంతో కేవలం 10 నిమిషాలనుకున్న మీటింగ్.. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. భారతీయుల  సామర్థ్యాన్ని మీరు గుర్తించండి.. మా ఇండియన్స్ మ్యా్థ్స్ లో చాలా ఫాస్ట్.. బ్రిటీష్ వాళ్లు మాకు ఇంగ్లిష్ నేర్పించి వెళ్లారు. దాంట్లోనూ మా వాళ్లు ఫాస్ట్ అని బిల్ గేట్స్ కు వివరించాను. హైదరాబాద్ లో మైక్రో సాఫ్ట్ ఆఫీసు పెట్టమని కోరాను. అయితే అది అసాధ్యమని వెంటనే చెప్పిన బిల్ గేట్స్.. కొన్నాళ్లకే మనసు మార్చుకొని ఇక్కడ ఆఫీసు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో టెక్, సాఫ్ట్ వేర్ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కట్టాయి. అనంతరం ఎంతో కష్టపడి ఐటీ కంపెనీలకు నిలయంగా ఉండేలా హైటెక్ సిటీని నిర్మించాం’’ అని చంద్రబాబు వివరించారు.