బీపీ 140 /80...పల్స్ 70/నిమిషం.. చంద్రబాబు హెల్త్ బులిటెన్..

బీపీ 140 /80...పల్స్ 70/నిమిషం.. చంద్రబాబు హెల్త్ బులిటెన్..

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను జైలు అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆయన 67 కిలోలు ఉన్నారని పేర్కొన్నారు. 

విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఉన్న బ్యారక్లో టవర్ ఏసీ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబుకు బీపీ 140 /80, పల్స్ 70/నిమిషం, రెస్పిరేటరీ రేటు : 12/ నిమిషం ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే చంద్రబాబు ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగున్నట్లు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారు. బ్యారక్ లో ఉక్కపోతగా ఉండటంతో ఇప్పటికే తనకున్న చర్మ సమస్యల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. అయితే జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో చంద్రబాబు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. జైల్లో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని.. పేర్కొంటూనే ప్రత్యేక కేసుగా పరిగనించి కోర్టు ఆదేశిస్తే..అప్పుడు పరిశీలిస్తామని ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ చెప్పారు. దీంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన తరపున న్యాయవాదులు అక్టోబర్ 14వ తేదీన హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాదనలు వినిపించారు. అక్టోబర్ 12వ తేదీన జీజీహెచ్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిన ప్రభుత్వ డాక్టర్లు చంద్రబాబు శరీరంలో పలు చోట్ల స్కిన్ అలర్జీ, దద్దుర్లు గుర్తించామని జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నదని ..ఆయన బ్యారక్లో చల్లటి వాతావరణం ఉండేలా చూడటంతో పాటు..పలు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారని కోర్టులో చెప్పారు. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను విన్న ఏసీబీ కోర్టు..డాక్టర్ల సూచనల మేరకు చంద్రబాబు బ్యారక్లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.