చంద్రుడిపై చీకట్లో విక్రమ్ ల్యాండర్.. AI సృష్టించిన అద్భుతాలు

చంద్రుడిపై చీకట్లో విక్రమ్ ల్యాండర్.. AI సృష్టించిన అద్భుతాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్.. ప్రపంచ దేశాల యందు దేశ కీర్తిని మరో అడుగు పెంచింది. ప్రజ్ఞాన్ రోవర్ సాయంతో అక్కడ పరిశోధనలు జరిపి.. విలువైన ఎంతో సమాచారాన్ని భూమికి చేరవేశాయి. అయితే ప్రస్తుతం అక్కడ (చంద్రునిపై) రాత్రివేళ కావడంతో.. ల్యాండర్, రోవర్‌లు స్లీపింగ్ మోడ్‌లో ఉన్నాయి. 

మరి చంద్రునిపై చల్లని రాత్రులలో నిద్రిస్తున్నప్పుడు ల్యాండర్ ఎలా ఉంటుందో ఊహించడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

14 రోజులు చీకట్లో

చంద్రుడు.. భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుంది. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటాడు మన చందమామ. అంటే చంద్రుడి మీద ఒక రాత్రి సమయం.. భూమి మీద 14 రాత్రులతో సమానమన్నమాట. ఈ 14 రోజుల రాత్రి వేళల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని ల్యాండర్, రోవర్ తట్టుకోగలవా! అన్నది ప్రశ్న. ఈ నెల 22న మళ్లీ చంద్రునిపై పగటి సమయం మొదలుకానుంది. అన్ని సవ్యంగా జరిగితే.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మళ్ళీ పరిశోధనలు సాగిస్తాయి.