
చంద్రయాన్-3 విజయం భారత్‌కే కాదు, ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయిన తరువాత తన మనసులో ఏం జరిగిందో వివరించడం కష్టమని తెలిపారు.
అవి అనంద క్షణాలన్న సోమనాథ్.. వాటిని వర్ణించడం కష్టమని చెప్పారు. అందరం ఎంతో సంతోషించామన్నారు. ఈ ప్రాజెక్టు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సోమనాథ్. చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి తాము ఎంతో నేర్చుకున్నామన్నారు సోమనాథ్.
జీవితంలో ప్రతి వైఫల్యం ఓ గొప్ప టీచర్ అని అభిప్రాయపడ్డారు. చంద్రయాన్ 2 తరువాత ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. చంద్రుడిపై నీటి జాడల అన్వేషణ కోసమే దక్షిణ ధృవాన్ని ఎంచుకున్నామని తెలిపారు.