ఇయ్యాల్నే చంద్రుడిపై ల్యాండింగ్.. 20 నిమిషాలు ఎంతో కీలకమన్న ఇస్రో

ఇయ్యాల్నే చంద్రుడిపై ల్యాండింగ్.. 20 నిమిషాలు ఎంతో కీలకమన్న ఇస్రో
  • ఇయ్యాల్నే చంద్రుడిపై ..ల్యాండింగ్
  • సాయంత్రం 6.04 గంటలకు  దక్షిణధ్రువంపై దిగనున్న విక్రమ్ 
  • 20 నిమిషాలు ఎంతో కీలకమన్న ఇస్రో
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు
  • ప్రతికూల పరిస్థితులు ఎదురైతే 27వ తేదీకి పోస్ట్​పోన్
  • 70 కి.మీ దూరం నుంచి జాబిల్లి ఫొటోలు పంపిన ల్యాండర్
  • అన్ని ఏర్పాట్లు చేసిన ఇస్రో.. ప్రపంచ దేశాల ఆసక్తి
  • యూపీ సహా పలు రాష్ట్రాల్లోని స్కూల్స్, కాలేజీల్లో లైవ్ టెలికాస్ట్

కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపనుంది. ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది. ల్యాండింగ్​ ప్రక్రియను సాయంత్రం 5.20 గంటల నుంచి యూట్యూబ్ చానెల్​ సహా పలు వేదికలపై లైవ్​ స్ట్రీమింగ్​ చేయనుంది. రష్యా పంపిన లూనా 25 ఫెయిల్ కావడంతో ప్రపంచ దేశాల చూపు మొత్తం విక్రమ్ ల్యాండింగ్​ పైనే ఉంది. విక్రమ్ ల్యాండర్ సాఫీగా చంద్రుడిపై దిగాలని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయాల్లో జనం పూజలు చేస్తున్నారు. ఇస్రో చరిత్ర సృష్టించాలని ప్రార్థిస్తున్నారు

న్యూఢిల్లీ:  ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. విక్రమ్ ల్యాండర్ మరికొన్ని గంటల్లో చందమామపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. విక్రమ్‌‌ ల్యాండర్‌‌, ప్రజ్ఞాన్‌‌ రోవర్‌‌తో కూడిన ల్యాండింగ్‌‌ మాడ్యూల్‌‌(ఎల్ఎం) చంద్రుడికి కేవలం 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. సేఫ్ గా దిగేందుకు ఏరియాను స్కాన్ చేస్తున్నది. రష్యా ప్రయోగించిన లూనా- 25 ప్రయోగం విఫలం కావడంతో ఇప్పుడు అందరి కళ్లూ ఇండియాపైనే ఉన్నాయి. ఈ చారిత్రక ఘట్టం కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు విక్రమ్ సేఫ్ ల్యాండ్ అవుతుందని ఇస్రో అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని సైంటిస్టులు మంగళవారం వెల్లడించారు. 

విక్రమ్ ప్రతీ కదలికను గమనిస్తూ ఉన్నామని, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని వివరించారు. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇస్రో సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్​కు చివరి 20 నిమిషాలు ఎంతో కీలకమని తెలిపారు. దీన్ని ‘20 మినిట్స్ టెర్రర్‌‌’ గా ఇస్రో అధికారులు, సైంటిస్టులు వివరించారు. విక్రమ్ ల్యాండింగ్​ను లైవ్​లో చూపించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, స్కూల్స్​లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ స్క్రీన్​లను ఏర్పాటు చేస్తున్నాయి. సాయంత్రం ఆరున్నర దాకా స్కూల్స్, కాలేజీలు తెరిచి ఉండనున్నాయి.

ఏరియా గుర్తించడంలో ఎల్​పీడీసీ కీలకం

70 కిలో మీటర్ల దూరం నుంచి చంద్రుడి ఫొటోల ను ల్యాండర్‌‌ తన కెమెరాతో క్లిక్​మనిపించింది. వీటన్నింటినీ కలిపి ఓ వీడియోగా చేసి ఇస్రో ట్విట్టర్​లో పోస్టు చేసింది. విక్రమ్‌‌ ల్యాండర్‌‌కు అమర్చిన ల్యాండర్‌‌ హజార్డ్‌‌ డిటెక్షన్‌‌ అండ్‌‌ అవైడెన్స్‌‌ కెమెరా(ఎల్​హెచ్​డీఏసీ) ఈ ఫొటోలు తీసిందని వెల్లడించింది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్​పీడీసీ) తీసిన ఫొటోల ద్వారా ల్యాండింగ్​కు ఏ ప్రాంతం అనువైందో తెలుస్తుందని వివరించింది. మిషన్‌‌ షెడ్యూల్‌‌లో ఉందని.. మొత్తం అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నదని పేర్కొంది. చంద్రయాన్‌‌ 3 ల్యాండింగ్‌‌ లైవ్ టెలికాస్ట్​ బుధవారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది. బండరాళ్లు, గుంతలు లేకుండా సేఫ్ ల్యాండింగ్ ఏరియాను గుర్తించడంలో ఎల్​పీడీసీ కీలకం. దీన్ని అహ్మదాబాద్​కు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) డెవలప్ చేసింది.

సమస్యలు ఎదురైతే 27వ తేదీకి పోస్ట్​పోన్

ల్యాండింగ్ ప్రక్రియ మొత్తం ఇండిపెండెంట్​గా కొనసాగుతుంది. సరైన ఎత్తులో.. సరైన టైమ్​లో.. సరిపడా ఫ్యూయెల్​ను వినియోగించుకుని ల్యాండర్‌‌ తన ఇంజిన్లు మండించుకోవాలి. ఆపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్‌‌ కోసం ఏరియాను స్కాన్‌‌ చేసుకుంటుంది. ఇదంతా ‘విక్రమ్’ స్వయంగా చేసుకోవాల్సిందే. సూర్యుడి వెలుగు రాగానే, ల్యాండర్ మాడ్యూల్​లో ఎలాంటి లోపం లేకుంటే సాఫ్ట్‌‌ ల్యాండింగ్‌‌ ప్రక్రియ ప్రారంభిస్తామని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నిలేశ్ దేశాయ్ తెలిపారు. వాతావరణం సహకరించకపోయినా ల్యాండింగ్​ను 27వ తేదీకి పోస్ట్​పోన్ చేస్తామన్నారు. ‘మాడ్యూల్ స్పీడ్ తగ్గిస్తున్నాం. 30 కి.మీ ఎత్తు నుంచి ల్యాండింగ్​కు ట్రై చేస్తున్నాం. ఆ టైమ్​లో వేగం సెకన్​కు 1.68 కి.మీ ఉంటుంది. ఆ వేగం తగ్గించడంపైనే మేము ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ చంద్రుడి గురుత్వాకర్షణ కీలకం” అని దేశాయ్ వివరించారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏముంది?

చంద్రుడి సౌత్ పోలార్ రీజియన్​లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ దేశం కూడా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేదు. భూమితో పోలిస్తే అక్కడి పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. మిషన్ సక్సెస్ అయితే.. ప్రపంచానికి సరికొత్త విషయాలు తెలియజేసే అవకాశం ఉంటుందని డీఎస్​టీ సైంటిస్ట్  టీవీ వెంకటేశ్వరన్ తెలిపారు.

లైవ్ ఇక్కడ చూడొచ్చు

విక్రమ్‌‌ ల్యాండర్‌‌ చందమామపై దిగుతున్న ప్పుడు లైవ్​గా చూడొచ్చు. ప్రత్యక్ష ప్రసారంపై ఇస్రో అధికారులు కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 5.20 గంటలకు ప్రారంభమై.. 6.15 గంటల దాకా కొనసాగుతుంది. MOX/ISTRAC లో లైవ్ చూడొచ్చు. అదేవిధంగా, ఇస్రో అధికారిక యూట్యూబ్ చానెల్​లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.  ఇస్రో వెబ్‌‌సైట్‌‌, డీడీ నేషనల్‌‌ చానెల్​లోనూ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.