మా చావుతోనైనా కేయూలో మార్పు రావాలె : స్టూడెంట్లు

మా చావుతోనైనా కేయూలో మార్పు రావాలె :  స్టూడెంట్లు
  • బలవంతంగా అరెస్ట్​చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు  
  • హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత

హనుమకొండ, వెలుగు: కేయూ స్టూడెంట్లు హనుమకొండలో చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ముందుగా ప్రకటించినట్లుగానే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సామూహిక ఆత్మార్పణ చేసుకునేందుకు స్టూడెంట్లు సిద్ధమయ్యారు. ఉదయం 7 గంటలకు స్థానిక పబ్లిక్ గార్డెన్​లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని, మౌనాన్ని నిరసిస్తూ తలకు నల్ల రిబ్బన్లు, చేతులకు సంకెళ్లు వేసుకుని దీక్షకు దిగారు. కేయూ పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. తమ చావుతోనైనా స్థానిక నేతలు, వర్సిటీ అధికారుల్లో మార్పు రావాలన్నారు. అయితే గాంధీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు మంత్రి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్​దాస్యం వినయ్ భాస్కర్, ఇతర నేతలు, ఆఫీసర్లు ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్ కు రావాల్సి ఉంది. అంతకు ముందు నుంచే కేయూ స్టూడెంట్లు నిరసనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ ఏసీపీ కిరణ్​కుమార్, సీఐ కరుణాకర్​స్టూడెంట్లతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. తమ బాధను మంత్రితోపాటు ఇతర లీడర్లకు చెప్పుకుంటామని, ఆందోళన విరమించేది లేదని స్టూడెంట్లు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు బలవంతంగా సంకెళ్లను కట్​చేసి, స్టూడెంట్లను అరెస్ట్​చేశారు. ఈ క్రమంలో పబ్లిక్​గార్డెన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో స్టూడెంట్​లీడర్లు నిమ్మల రాజేశ్, మాచర్ల రాంబాబు, అరెగంటి నాగరాజు, బొట్ల మనోహర్, ఎండీ పాషా తదితరులు ఉన్నారు. కాగా తమను వివిధ స్టేషన్లు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అరెస్ట్ అయిన స్టూడెంట్లు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తమను ఎక్కడికి తీసుకెళ్లినా ఆత్మార్పణలు ఆగవని అందులో తెలిపారు. చివరకు స్టూడెంట్లను ధర్మసాగర్ పోలీస్​స్టేషన్​కు తరలించగా, అక్కడ కొద్దిసేపు నిరసన కొనసాగించారు. మధ్యాహ్నం తర్వాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. తర్వాత క్యాంపస్​కు చేరుకుని నిరసన దీక్ష కొనసాగించారు.

నేడు కేయూ బంద్ కు పిలుపు

స్టూడెంట్ల అరెస్ట్ ను కేయూ స్టూడెంట్​జేఏసీ లీడర్లు ఖండించారు. మంగళవారం వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. ఏబీవీపీ నేత మాచర్ల రాంబాబు మాట్లాడుతూ.. తమ చావుతోనైనా కేయూ వీసీ, రిజిస్ట్రార్, మంత్రులు, ఎమ్మెల్యేలకు బుద్ధి రావాలని ఆవేదన చెందారు. ఈ క్రమంలోనే సామూహిక ఆత్మార్పణకు సిద్ధపడినట్లు తెలిపారు. అర్హులకు న్యాయం చేసేంత వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.