బండి సంజయ్ వాహనంపై  చెప్పులు, గుడ్లు విసిరిన బీఆర్ఎస్ 

బండి సంజయ్ వాహనంపై  చెప్పులు, గుడ్లు విసిరిన బీఆర్ఎస్ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వాహనంపై దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పదో తరగతి పేపర్ల లీకేజీకి కుట్రదారుడిగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ను హన్మకొండ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీస్ వాహనంలో ఆయన్ను కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో.. వరంగల్ అధాలత్ సెంటర్ దగ్గర కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు.. బండి సంజయ్ వాహనంపై చెప్పులు, కోడి గుడ్లు విసిరారు. బండి సంజయ్ వెళుతున్న వాహనాన్ని టార్గెట్ చేసి మరీ.. చెప్పులు, కోడిగుడ్లు విసరటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతం నుంచి వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు పోలీసులు. 

కోర్టు దగ్గరకు వచ్చిన సమయంలోనూ బండి సంజయ్ ఉన్న పోలీస్ వాహనంపై చెప్పులు విసిరారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అప్పటికే అక్కడ ఉన్న వందలాది మందిని చెల్లాచెదురు చేశారు. బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డగించారు. బండిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీస్ వాహనంపైకి ఎక్కి అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి అందర్నీ చెదరగొట్టారు. 
 
బండి సంజయ్ పై చెప్పులు, కోడిగుడ్లు విసిరినట్లు వార్తలు రావటంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హన్మకొండ కోర్టు ఎదుట నిరసనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో..  కోర్టు చుట్టుపక్కల భారీగా మోహరించిన పోలీసులు.. అక్కడి నుంచి అందర్నీ పంపించి వేశారు. కోర్టు చుట్టుపక్కలకు ఎవరూ లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.