- ప్రజాపాలన దినోత్సవంలో నిర్లక్ష్యంపై
- వివరణ ఇవ్వాలని కలెక్టర్‌కు సీఎస్ ఆదేశం
- ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్, గౌరవం ఇవ్వని
- అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన వేడుకల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ.. కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సీఎస్ కె.రామకృష్ణారావు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా పరేడ్ గ్రౌండ్‌కు ఉదయం 9.55 గంటలకే చేరుకొని జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.
ముఖ్యఅతిథిని ఆహ్వానించాలి. కానీ.. జెండా ఆవిష్కరించాల్సిన ముఖ్య అతిథి, విప్ ఆది శ్రీనివాస్అప్పటికే వచ్చి కలెక్టర్ కోసం ఎదురుచూశారు. 10 గంటలు దాటినా కలెక్టర్ రాకపోవడంతో.. ఆయన లేకుండానే జెండావిష్కరణ చేశారు. పైగా కలెక్టర్ అధికారులు, స్టాఫ్‌ను సమీకరించకపోవడం, ముఖ్య అతిథికి సందేశం అవసరం లేదని చెప్పడంతో తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధుల పట్ల గౌరవంగా లేకపోయినా, ప్రొటోకాల్ పాటించకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని తాజాగా హెచ్చరించింది.
