చర్లగూడెం రిజర్వాయర్​ బాధితులను కనికరించని సర్కారు

చర్లగూడెం రిజర్వాయర్​ బాధితులను కనికరించని సర్కారు

‘మాకు నష్టం జరిగినా సీఎం ఆదుకుంటారని నమ్మినం.. సాగు భూములు త్యాగం చేసినం. ఏడేండ్ల కాలం కళ్లముందే కరిగిపోయింది. కానీ సర్కారు కనికరించలేదు. ఇళ్లు, భూములు కోల్పోతున్న మాకు కొత్త ఇళ్లు కట్టిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ ఇళ్లు, ఉద్యోగాలకు దిక్కు లేదు. ఇదేందని అడిగితే కాంట్రాక్టర్ పోలీసులతో మమ్మల్ని కొట్టిస్తున్నడు.’ 

నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని చర్లగూడెం రిజర్వాయర్​ బాధితుల గోస ఇది. ఈ రిజర్వాయర్​ కింద నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకెపల్లి, వెంకెపల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. మొత్తం నాలుగు గ్రామాల్లో సుమారు 1,600 కుటుంబాలు ఉంటున్నాయి. ముంపు గ్రామాల్లో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. రిజర్వాయర్​ నిర్మాణం కోసం 2015లో 4 వేల ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.4 లక్షల పరిహారం ఇచ్చారు. కానీ పునరావాస కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీ సైతం అమలు చేయలేదు. దీనిపై ఇప్పటికే అనేకసార్లు ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. కానీ ఇప్పటికీ సమస్య కొలిక్కిరాకపోవడంతో నర్సిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు 44 రోజులుగా దీక్ష చేస్తున్నారు. 

ఏడేండ్లుగా ఎదురుచూపులే..
డిండి లిఫ్ట్​ స్కీంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్(శివన్నగూడెం) నిర్మాణానికి 2015లో సీఎం కేసీఆర్​శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి దాదాపు ఏడేండ్లు కావస్తున్నా ముంపు బాధితుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. భూముల పరిహారం విషయంలోనే తామంతా నష్టపోయామని ప్రజలు నెత్తినోరు బాదుకుంటున్నారు. కాళేశ్వరం తరహాలో భారీ ప్యాకేజీ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎకరాకు రూ.4 లక్షలు ముట్టజెప్పి చేతులు దులుపుకొందని వాపోతున్నారు.  భూములు కోల్పోయిన తమకు ఉండటానికి ఇల్లు అయినా ఇవ్వాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. పునరావాస ప్యాకేజీ కింద నిర్మిస్తామని చెప్పిన ఆఫీసర్లు చింతపల్లి మండలంలో ఇండ్ల నిర్మాణానికి ప్రపోజల్స్​పంపారు. కానీ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ అవే శిథిల ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. 

వరద నీరంతా ఇళ్లలోకే...
చర్లగూడెం పనులు ఇప్పటికే 40 శాతం పూర్తయ్యాయి. రెండు ప్యాకేజీలకు కలిపి సుమారు రూ.15 కోట్ల పనులు జరుగుతున్నాయి. రిజర్వాయర్​కట్ట ముంపు గ్రామాలకు ఎత్తులో ఉండటంతో పైనుంచి వచ్చే వరద నీరంతా ఇళ్లలోకి ప్రవహిస్తోంది. దీంతో వర్షాలు వచ్చినప్పుడు నర్సిరెడ్డిగూడెం ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. పైగా నిర్మాణ పనులు నాసిరకంగా ఉండటంతో రిజర్వాయర్ల కట్టలు బీటలు వారాయి. ఈ కట్టల పైనుంచి వచ్చే వరద నీరంతా కిందికి చేరడంతో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. రిజర్వాయర్​ పనులు పూర్తయ్యేవరకు ఆ భూముల్లో పంటలు సాగు చేసుకోవచ్చని శంకుస్థాపనప్పుడు సీఎం చెప్పారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం రిజర్వాయర్​పనులకు అవసరమయ్యే మట్టినంతా ఆ భూముల నుంచే తరలిస్తుండటంతో సాగుకు పనికి రాకుండా పోయాయి. మట్టి తవ్వకాలతో వ్యవసాయ భూముల్లో 20 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయా రు. ప్రస్తుతం నర్సిరెడ్డిగూడెం గ్రామ ప్రజల దీక్షతో 40 రోజులుగా అధికారులు రిజర్వాయర్​ పనులు ఆపేశారు.