చార్లెస్ సి మోర్గాన్ ఎలా చనిపోయాడు..? ఎవరు చంపారు..?

చార్లెస్ సి మోర్గాన్ ఎలా చనిపోయాడు..? ఎవరు చంపారు..?

ఓ వ్యక్తి శవం ఒక ఎడారిలో దొరికింది. అతని తల వెనక భాగంలో తుపాకీతో కాల్చిన గాయం ఉంది. పరీక్షిస్తే.. ఆ గాయం అతని తుపాకీ వల్ల అయ్యిందే! శవం దొరికిన ప్లేస్‌‌లో కొన్ని మిస్టీరియస్‌‌ ఆధారాలు ఉన్నాయి. కానీ..  ఎంక్వైరీ చేసిన అధికారులు మాత్రం అది ఆత్మహత్యే అని సింపుల్‌‌గా తేల్చేశారు. ఇంతకీ ఆ కేసులో ఏం జరిగింది? అతని చావుకు కారకులెవరు? అతను చేసే ఉద్యోగమే అతని ప్రాణాలు తీసిందా? అధికారులు చెప్పినట్టు అది ఆత్మహత్యేనా? 

చార్లెస్ సి మోర్గాన్ అమెరికాలోని అరిజోనా స్టేట్‌‌లో ఉన్న టక్సన్ సిటీలో ఉండేవాడు. ఎస్క్రో అనే కంపెనీలో ఏజెంట్‌‌గా పనిచేసేవాడు అతను. 1977 మే నెలలో సిటీకి 40 మైళ్ల దూరంలో ఉన్న ఒక ఎడారిలో అతని శవం కనిపించింది. కానీ.. అతను ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. రీసెర్చర్లు మాత్రం మోర్గాన్ చావుకు అనేక కారణాలు చెప్తున్నారు.  

ఉద్యోగానికి వెళ్లి కిడ్నాప్‌‌

అది 1977 మార్చి 22. మోర్గాన్ ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయల్దేరాడు. కానీ ఆరోజు తిరిగి ఇంటికి రాలేదు. సరిగ్గా మూడు రోజులకు తిరిగి వచ్చాడు. తెల్లవారుజామున 2:00 గంటలకు ఇంటి తలుపు తట్టాడు. అప్పడు అతని చేతికి ప్లాస్టిక్ హ్యాండ్‌‌ కఫ్‌‌ వేసి ఉంది. దాన్ని చూసిన అతని భార్య రూత్ మోర్గాన్ కంగారు పడింది. ‘ఏం జరిగింద’ని అతన్ని అడిగింది. ‘‘నేను మాట్లాడలేను’’ అన్నట్టు సైగలతో చెప్పాడు. రూత్ అతనికి పెన్ను, ఒక పేపర్ ఇచ్చి రాయమంది. ‘‘నన్ను కిడ్నాప్‌‌ చేశారు. నన్ను మాట్లాడకుండా చేసేందుకు నాడీ వ్యవస్థపై పనిచేసే హాలూసినోజెనిక్ అనే డ్రగ్‌‌ఇచ్చార’’ని ఆ పేపర్ మీద రాశాడు. వెంటనే రూత్‌‌ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి బయల్దేరుతుంటే మోర్గాన్ ఆమెను ఆపేశాడు.

కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిస్తే..  కుటుంబానికి చాలా ప్రమాదం అంటాడు. కానీ.. ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. రెండు మూడు రోజులు గడిచాక మోర్గాన్‌‌ రూత్‌‌కి ఒక సీక్రెట్‌‌చెప్పాడు. ‘‘నేను కొన్నేండ్లుగా గవర్నమెంట్‌‌ ట్రెజరీ డిపార్ట్‌‌మెంట్‌‌కు సీక్రెట్ ఏజెంట్‌‌గా పనిచేస్తున్నా. అందుకే నన్ను కిడ్నాప్‌‌ చేశారు. నా ట్రెజరీ ఐడీని తీసుకున్నారు” అని చెప్పాడు. వాస్తవానికి1865 జూలై 5న అమెరికా ఒక సీక్రెట్ సర్వీస్‌‌ మొదలుపెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోసాలు చేసే వ్యక్తులను గుర్తించడం అందులో ఉన్న ఏజెంట్లు చేసే పని. 

రెండోసారి 

మోర్గాన్ కిడ్నాప్ అయిన రెండు నెలల తర్వాత మళ్లీ కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజులకు రూత్‌‌కి ఒక ఫోన్ కాల్‌‌వచ్చింది. ఒక గుర్తుతెలియని మహిళ రూత్‌‌తో “12, 1 నుంచి 8 వరకు మోర్గాన్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఉరి వేసుకున్నాడు” అని చెప్పి కాల్‌‌ కట్‌‌ చేసింది. రూత్‌‌ భయపడింది. కానీ.. ఏమీ చేయలేని పరిస్థితి ఆమెది. ఆ ఫోన్ కాల్‌‌ వచ్చిన రెండు రోజులకు జూన్18న మోర్గాన్‌‌ శవం టక్సన్‌‌కు పశ్చిమాన 40 మైళ్ల దూరంలో కనిపించింది. తన తుపాకీ ‘357 కాలిబర్ మాగ్నమ్ రివాల్వర్‌‌’తో తల వెనక భాగంలో కాల్చిన గాయం ఉంది.

అతను కనిపించకుండా పోయినప్పుడు వేసుకున్న అదే బుల్లెట్ ప్రూఫ్ చొక్కా, నైఫ్ బకెల్‌‌బెల్ట్ ఒంటిపై ఉన్నాయి. శవం దగ్గరే సన్ గ్లాసెస్ కూడా దొరికాయి. కానీ.. అవి అతనివి కావు. విచిత్రంగా మోర్గాన్ లోదుస్తులకు రెండు డాలర్ల నోటు, టక్సన్, మెక్సికో మధ్య ఉన్న రోబుల్స్ జంక్షన్, సలాసిటీ పట్టణాలకు వెళ్లే మ్యాప్‌‌ పిన్‌‌ చేసి ఉన్నాయి. అప్పట్లో ఆ టౌన్స్‌‌ స్మగ్లింగ్‌‌కి కేరాఫ్‌‌గా ఉండేవి.  రెండు డాలర్ల నోటుపై కొన్ని అంకెలపై ఏదో కోడ్‌‌ని చెప్తున్నట్టు యారో మార్క్‌‌లు ఉన్నాయి. 

ఆత్మహత్యే 

శవం దగ్గర అతని తుపాకీ మీద ఒక్క వేలిముద్ర కూడా కనిపించలేదు. మోర్గాన్ చేతిపై మాత్రం గన్‌‌ పౌడర్ అవశేషాలు దొరికాయి. ఈ ఒక్క కారణం వల్లే అధికారులు దాన్ని ఆత్మహత్యగా తేల్చేశారు. 

థియరీలు.. అనుమానాలు 

  •     మోర్గాన్ చనిపోయాక అనేక అనుమానాలు, థియరీలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా అతను చనిపోకముందు రూత్‌‌కి ఫోన్‌‌ చేసిన మహిళ ఎవరు? అని ఎంక్వైరీ        చేశారు. కానీ.. సమాధానం దొరకలేదు. 
  •     మోర్గాన్‌‌ది కుడిచేతి వాటం. ఏ పని అయినా.. కుడి చేత్తోనే చేసేవాడు. కానీ.. గన్‌‌ పౌడర్‌‌‌‌ ఎడమ చేతిపై ఉంది. ఎడమ చేతితో తల వెనక భాగంలో                             కాల్చుకోవాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడి ఎందుకు కాల్చుకుంటాడు? ఆత్మహత్య చేసుకునేవాడే అయితే.. కుడి చేత్తోనే కాల్చుకునేవాడు కదా? అని       రీసెర్చర్లు అనుమానం వ్యక్తం చేశారు. 
  •     క్రైం జరిగిన ప్లేస్‌‌లో దొరికిన సన్‌‌గ్లాసెస్‌‌ మోర్గాన్‌‌వి కాదు. మరి అవి ఎవరివి? అక్కడ ఎందుకు ఉన్నాయి? అని పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. చేసి ఉంటే           హంతకుడు ఎవరో తెలిసేది.  
  •     సీక్రెట్ సర్వీస్‌‌లో ఉండటం వల్ల మోర్గాన్‌‌ని చంపారని అంతా అనుకున్నారు. కానీ.. అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు అరిజోనా–మెక్సికో                       సరిహద్దుకు ఇరువైపులా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగిన కేసులో అతను సాక్షి కూడా. అది కూడా అతని చావుకు కారణం కావచ్చు.  
  •     మోర్గాన్‌‌ చనిపోయిన 13 ఏండ్ల తర్వాత 1990 ఫిబ్రవరి 7న ఈ కేసును కవర్ చేస్తూ ఎన్‌‌బిసి ఛానెల్‌‌ ఒక అన్‌‌సాల్వ్డ్ మిస్టరీస్ ఎపిసోడ్ ప్రసారం చేసింది.                  మోర్గాన్‌‌కు మనీ లాండరింగ్, బంగారం, ప్లాటినం లావాదేవీలతో సంబంధాలు ఉన్నాయని రిపోర్టర్‌‌‌‌ డాన్ డెవెరెక్స్‌‌ చెప్పాడు. వాటివల్లే అతను చనిపోయాడని       కూడా చెప్పాడు.