
ఐఐటి మద్రాస్ క్యాంపస్‌కు చెందిన ఓ గెస్ట్ లెక్చరర్ కాలేజీ హాకీ గ్రౌండులో శవమై కనిపించాడు. కేరళకు చెందిన 30 ఏళ్ల ఉన్నికృష్ణన్ నాయర్ ఏప్రిల్ 2021లో బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా మరియు గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నికృష్ణన్ చెన్నైలోని వెలాచేరీ ప్రాంతంలో ఇద్దరు రూమ్‌మేట్స్‌తో కలిసి ఉంటున్నాడు. ఉన్నికృష్ణన్ ఈ మధ్యే కేరళలోని సొంతూరుకు వెళ్లి.. గురువారం తెల్లవారుజామున క్యాంపస్‌కు వచ్చాడు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. అదే రోజు ఉదయం కాలేజీ హాకీ మైదానంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ విద్యార్థులు హాకీ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ వెళ్లేసరికి.. అక్కడ ఉన్నికృష్ణన్ శవం కనిపించింది. వెంటనే విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. కాలేజీ స్పోర్ట్స్ లెక్చరర్ కొట్టూర్‌పురం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ఆస్పత్రికి తరలించారు. అయితే దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఉన్నికృష్ణన్ గదిలో వెతకగా.. అక్కడ 11 పేజీల సూసైడ్ లెటర్ లభించింది. పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.