- 90 మీటర్ల మేర మూడు చోట్ల పగుళ్లు
- రూ.23 కోట్లతో ఇటీవలే నిర్మాణం పూర్తి
- ప్రారంభానికి ముందే కూలడంతో ఆయకట్టు ప్రశ్నార్థకం
- జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఆఫీసర్లు
పెద్దపల్లి/జమ్మికుంట, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామాల నడుమ మానేరుపై సుమారు కిలోమీటర్ పొడువు నిర్మించిన చెక్ డ్యామ్ శుక్రవారం అర్ధరాత్రి ధ్వంసమైంది. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం కారణంగా మానేరు వాగులో ఇసుక అక్రమ రవాణా దెబ్బతినడంతో ఇసుక మాఫియాకు చెందిన కొందరు డిటోనేటర్లతో పేల్చివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెక్‌డ్యామ్‌కు మూడు చోట్ల పగుళ్లు రావడం, పేల్చివేసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో ఇరిగేషన్ ఆఫీసర్లు జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రారంభానికి ముందే కూలింది
సాగు అవసరాలు, భూగర్భ జలాల పెంపు లక్ష్యంతో మానేరు నదిపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్నుంచి అడవిసోమన్‌పల్లి వరకు 25 చెక్‌డ్యామ్‌లకు గత బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. వీటిలో కొన్ని పూర్తికాగా, చాలావరకు వివిధ దశల్లో ఉన్నాయి. గుంపుల, తనుగుల గ్రామాల నడుమ తాజాగా ధ్వంసమైన చెక్‌డ్యామ్ పనులు 2018లో ప్రారంభం కాగా, 2025లో పూర్తయ్యాయి. ఇందుకోసం సుమారు రూ.23 కోట్లు ఖర్చుచేశారు. త్వరలోనే ఓపెనింగ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా ఈలోపే కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఇసుక మాఫియా పైనే అనుమానాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల, పాపక్కపల్లి, విలాసాగర్, వావిలాల, శంభునిపల్లి, గండ్రపల్లి కేంద్రంగా గతంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా జరిగేది. గుంపుల కేంద్రంగా సుమారు 200 ట్రాక్టర్లు, తనుగుల వైపు 300 నుంచి 400 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా కొనసాగేది. ఎక్స్కవేటర్ల ద్వారా పొద్దంతా తవ్వకాలు జరిపి, గ్రామాల్లో డంపులు చేసి, రాత్రి పూట లారీల్లో హైదరాబాద్‌సహా వివిధ ప్రాంతాలకు తరలించేవారు. చెక్డ్యామ్నిర్మాణం పూర్తికావడంతో వీరి దందాకు అడ్డుకట్ట పడింది. దీంతో చెక్‌డ్యామ్‌ను కూలిస్తే తప్ప తమ ఇసుక దందా సాగదనే నిర్ణయానికి వచ్చిన అక్రమార్కులు శుక్రవారం అర్ధరాత్రి డిటోనేటర్లతో పేల్చివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
చెక్‌డ్యామ్ కూలిపోయిన విషయం తెలుసుకొని శనివారం ఘటనా స్థలానికి ఇరిగేషన్ ఈఈ కే బలరామయ్య, డీఈ రవి, జేఈ శ్రావణ్, జమ్మికుంట ఎస్ఐ సతీశ్, పొత్కపల్లి ఏఎస్ఐ అశోక్, ఓదెల తహసీల్దార్ దీరజ్‌కుమార్ చేరుకున్నారు. బ్లాస్టింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మానేరు ఇరిగేషన్ఈఈ బలరామయ్య మాట్లాడుతూ.. చెక్ డ్యామ్‌ను బ్లాస్ట్ చేసినట్లు కనిపిస్తున్నదని, ఇసుక మాఫియానే ఈ చర్యకు పాల్పడిందనే అనుమానాలున్నాయన్నారు. చెక్‌డ్యామ్‌ను కూల్చినట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ మేరకు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చెక్ డ్యామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్ట్ చేశారంటూ డీఈ రవి, జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో 90 మీటర్ల మేర చెక్‌డ్యామ్ దెబ్బతిన్నదని, దీని వల్ల 100 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు.
