- కేంద్రమంత్రి బండి సంజయ్
జమ్మికుంట/హుజురాబాద్, వెలుగు : ప్రజల కోసం, రైతుల కోసం కాకుండా కమీషన్ల కోసం చెక్‌డ్యామ్‌లు కడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలో కూడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగడం లేదన్నారు. ప్రణాళిక, క్వాలిటీ లేకుండా చెక్‌డ్యామ్‌లు నిర్మించారని ఆర్నేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోనూ చెక్‌డ్యామ్‌లు కూలిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయా ఘటనలపై విచారణ జరపాలని, బాధ్యులైన కాంట్రాక్టర్ ఆస్తులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తొత్తులుగా పనిచేసిన వాళ్లకు కూడా పైసలు తీసుకుని మంచి పోస్టింగ్‌లు ఇస్తున్నారని, అలాంటి ఆఫీసర్లకు బీఆర్ఎస్ లీడర్లే పైసలిచ్చి పంపిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సోమవారం జమ్మికుంట, హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసి, సేవలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. చాలా ఆస్పత్రుల్లో సూదులు, మందులు, దూది కూడా ఉండటం లేదన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇస్తున్న నిధులను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తన బర్త్ డే సందర్భంగా వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్‌ఎండీసీ సాయంతో రూ.4 కోట్ల విలువైన వైద్యపరికరాలు అందించినట్లు చెప్పారు.
ఆ పరికరాలను సరిగా వాడుకోకుంటే వాటిని వాపస్ తీసుకుపోయి ఇతర చోట్ల అందిస్తానని అన్నారు. గతంలో వేములవాడ, కరీంనగర్ ఆస్పత్రులకు అంబులెన్స్ లు ఇవ్వగా.. వాటిని వాడుకోలేదని, దాంతో వాపసు తీసుకుని వేరే ఆస్పత్రులకు పంపినట్టు గుర్తు చేశారు.
