తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం... భయాందోళనలో భక్తులు..

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం... భయాందోళనలో భక్తులు..

కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలోని 405వ మెట్టు దగ్గర చిరుత ప్రత్యక్షమవ్వడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు. భక్తులు మెట్లు ఎక్కుతున్న సమయంలో  అకస్మాత్తుగా చిరుత కనిపించడంతో కాసేపు ఆందోళన నెలకొంది.చిరుత సంచారంపై టీటీడీ అధికారులకు సమాచారం అందించారు భక్తులు. తక్షణమే స్పందించిన అధికారులు శ్రీవారి మెట్ల మార్గంలో కొద్దిసేపు భక్తులను అనుమతించడం ఆపేశారు.

చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని చిరుతను దారి మళ్లించారు అటవీశాఖ సిబ్బంది. ఆ తర్వాత చిరుత కనిపించిన ప్రాంతంలో గస్తీ పెంచిన అధికారులు.. చిరుతను అడవిలోకి పంపేశారు. భక్తుల భద్రత దృష్ట్యా తాత్కాలికంగా శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసేస్తున్నామని.. అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రాగానే భక్తులను తిరిగి అనుమతిస్తామని తెలిపారు టీటీడీ అధికారులు.

చిరుత ప్రత్యక్షమవ్వడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు. టీటీడీ అధికారులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇటీవల తరచూ తిరుమల పరిసరాల్లో చిరుతలు సంచరిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. విజిలెన్స్ సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణలో భద్రతఏర్పాటు చేశారు అధికారులు.