
కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత పులుల సంచారం గురించి వార్తలు తరచూ వింటూనే ఉంటాం.. నడక దారిలో, ఘాట్ రోడ్డు వంటి ప్రాంతాల్లో తరచూ పులులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. కొండకు వెళ్లే భక్తులపై దాడులు చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే.. సోమవారం ( ఆగస్టు 5 ) అర్థరాత్రి అరుదైన ఘటన జరిగింది. తిరుమల కొండపై గంగమ్మ గుడిలో పిల్లిని వేటాడింది చిరుత పులి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమలలో ఈస్ట్ బాలాజీ నగర్ లో ఉన్న గంగమ్మ గుడిలో పిల్లిని వేటాడింది చిరుత పులి.ఇందుకు సంబందించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ గా మారింది.
మెల్లగా గుడిలోకి వచ్చిన పులి.. పిల్లిని వేటాడింది. పిల్లిని చంపి తినేందుకు విఫల యత్నం చేసింది పులి. పులి దాడితో అప్రమత్తమైన పిల్లి కొన్ని సెకన్ల పాటు పోరాడి తప్పించుకుంది. పులి బారి నుండి తప్పించుకున్న పిల్లి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. పిల్లి తప్పించుకోవడంతో చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పులి.
తిరుమల కొండపై గంగమ్మ గుడిలో పిల్లిని వేటాడిన పులి... pic.twitter.com/jaXGY9IwTW
— Manohar Reddy (@ManoharRed18542) August 5, 2025
పులి బారి నుంచి తనను కాపాడమని పిల్లి ఆ గంగమ్మను వేడుకుందో, ఏడుకొండల వాడిని వేడుకుందో కానీ.. చావు అంచుల దాకా వెళ్లి బతికిపోయింది. ఏది ఏమైనా భూమి మీద నూకాలు ఉంటే.. ఎంతటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు అంటే ఇదేనేమో. పులి పిల్లిని వేటాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.