రైలు మార్గం ద్వారా కాశ్మీర్‌ని కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ అద్భుతం, ఆశ్చర్యం అనిపించక మానదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనటానికి ఇది తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తోంది. వరల్డ్‌లోనే గుర్తింపు పొందిన ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు. కానీ చీనాబ్ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల హైట్‌లో కడుతున్నారు. దీంతో, ఇది ప్రపంచంలోనే ఎత్తయిన, పొడవైన రైల్వే కట్టడంలా రికార్డ్ సృష్టించనుంది. ఈ బ్రిడ్జ్‌ని ‘మనిషి చేసిన మిరాకిల్’ అనొచ్చు.
అల్లంత దూరంలోని అందాల కాశ్మీర్‌ని చూడాలని అందరికీ ఉంటుంది. అక్కడికి వెళ్లటానికి మాత్రం సరైన ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. ప్రస్తుతం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాశ్మీర్ లోయ ప్రాంతానికి దగ్గరగా (15 కిలోమీటర్ల దూరంలో) ఉంది. రైలులో వెళ్లాలనుకుంటే జమ్మూతావి స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. జమ్మూ రైల్వే స్టేషన్, కాశ్మీర్ మధ్య దూరం 330 కిలోమీటర్లు. జమ్మూతావి నుంచి కాశ్మీర్‌కి బస్సులు ఉంటాయి గానీ చాలా ఖర్చుతో కూడిన ప్రయాణం.
ఫ్లైట్‌లో వెళ్లటం సామాన్యులకు సాధ్యం కాదు. కొన్నేళ్ల కిందటి వరకు శ్రీనగర్ దాక రైల్వే ట్రాకే లేదు. దీంతో మన దేశంలోని చాలామంది ఈ భూతల స్వర్గాన్ని చూసే ఛాన్స్ కోల్పోయేవారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి హనీమూన్, హాలీడే, అడ్వెంచర్ల కోసం ఇక్కడికి వచ్చి వెళ్తున్నా, మనకి మాత్రం ఆ భాగ్యం కలగట్లేదు. కాశ్మీర్‌ని దేశంతో కనెక్ట్ చేసే ప్రయత్నాల్ని కేంద్రం దాదాపు 40 ఏళ్ల కిందటే మొదలుపెట్టినా ముందుకు సాగలేదు.
పీవీ టు మోడీ
నిజానికి బ్రిడ్జి ప్రాజెక్ట్ పి.వి.నరసింహారావు హయాంలో అప్రూవ్ అయింది. 1995లో ఆరంభించి 2002లో పూర్తి చేయాలనుకున్నారు. పనులు సాగలేదు. ఆ తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం 2002లో జమ్మూ–కాశ్మీర్ రైల్వే లింక్‌ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి 2007నాటికి డెడ్‌లైన్ పెట్టారు. సేఫ్టీ విషయంలో అనుమానాలతో అనేకసార్లు పనులు ఆగిపోయాయి. మోడీ సర్కారు వచ్చాక ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలన్న పట్టుదలతో 2017లో తిరిగి ప్రారంభించారు. బ్రిడ్జి ప్రాంతంలో గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్లు. కానీ, 260 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఏమీకాని విధంగా, 120 ఏళ్లపాటు చెక్కుచెదరని రీతిలో బ్రిడ్జిని పక్కాగా నిర్మిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 1,400 మంది రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. వీరిలో స్థానికులు 500 మంది.
మొత్తం ప్రాజెక్టు ఐదు భాగాలుగా
జమ్మూలోని ఉదంపూర్ నుంచి శ్రీనగర్ మీదుగా కాశ్మీర్ లోయలోని బారాముల్లా వరకు 272 కిలోమీటర్ల పొడవున రైల్ లైన్ ప్లాన్ చేశారు. కానీ, ముందుకు సాగలేదు. కాశ్మీర్‌లోని భౌగోళిక పరిస్థితులవల్ల అనేక జియోలాజికల్ ఛాలెంజ్‌లు ఎదురయ్యాయి. ఉదంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లైన్‌ను నాలుగు భాగాలుగా విడదీశారు. దీనికి జమ్మూ–ఉదంపూర్ సెక్షన్‌ని కలిపి మొత్తం ఐదు భాగాలు చేశారు.
జమ్మూ–ఉదంపూర్ : 60–70 కిలోమీటర్లు
ఉదంపూర్–కాత్రా : 25 కిలోమీటర్లు
కాత్రా–బనిహల్ : 111 కిలోమీటర్లు
బనిహల్–ఖాజిగండ్ : 18 కిలోమీటర్లు
ఖాజిగండ్–బారాముల్లా : 118 కిలోమీటర్లు
టెర్రరిస్టులు బాంబు పేలుళ్లకు పాల్పడినా రైలు ఆగకుండా 30 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఏర్పాట్లు చేశారు. చీనాబ్ బ్రిడ్జికి అడుగడుగునా సీసీటీవీలు పెట్టారు. ఒకవేళ అవి పనిచేయకపోతే వెంటనే అలర్ట్ కాల్ వస్తుంది. బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలు మోస్తున్న కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌ని, ఇర్కాన్ సంస్థను ప్రధానమంత్రి ఆఫీస్ వెంటనే ఎలర్ట్ చేస్తుంది. బ్రిడ్జి పిల్లర్లకు 15 ఏళ్లయినా వెలిసిపోని విధంగా కరోజన్–రెసిస్టెంట్ పెయింట్ వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి ఇప్పటికి అయిదుసార్లు డెడ్‌లైన్ మార్చాల్సి వచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే… 2021 డిసెంబర్ నాటికి ఈ బ్రిడ్జిపై రైళ్లు పరుగులు తీస్తాయి.