మాచారం మారుతోంది .. ఇందిర సౌర గిరి జల వికాస పథకంతో మారిన చెంచుల వ్యవసాయం

మాచారం మారుతోంది .. ఇందిర సౌర గిరి జల వికాస పథకంతో మారిన చెంచుల వ్యవసాయం
  •  పండ్ల తోటల్లో అంతర పంటల సాగు
  • ఆనందంలో చెంచులు

నాగర్​కర్నూల్, వెలుగు: ఒకప్పుడు పోడు భూమి కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన చెంచుపెంటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిర సౌరగిరి జల వికాస పథకం ఊహించని మార్పులు తెచ్చింది. అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన సర్కారు పోడు భూముల్లో అడవి బిడ్డలకు హక్కులు కల్పించింది. ప్రభుత్వ సాయాన్ని అందిపుచ్చుకుంటున్న చెంచులు సోలార్, డ్రిప్ సిస్టం ద్వారా పండ్ల తోటలు, అంతర పంటలు సాగు చేస్తున్నారు. 

ఇన్నాళ్లూ సంప్రదాయ పోడు సాగుకు పరిమితమైన చెంచులు పండ్ల తోటల మధ్య వాణిజ్య పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా వేయించిన బోర్లు, సోలార్​ పంపులు, డ్రిప్​, స్ప్రింక్లర్లతో వారి వ్యవసాయ విధానం పూర్తిగా మారిపోయింది. ఎకరా భూమి కోసం పెట్రోల్​ మీద పోసుకొని జైలుకెళ్లినం.. ప్రభుత్వం ఇప్పుడు భూ పట్టాలతోపాటు బోర్, మోటార్, తోటల సాగుకు సాయం చేసింది.. మా కోసమే తెలంగాణ వచ్చిందేమో అనిపిస్తోందంటూ  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

55 చెంచు కుటుంబాలు..

నల్లమలలోని మాచారం చెంచుపెంటలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ప్రారంభించింది. మాచారంలో 55 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. మొదటి విడత కింద వీరిలో 26 మందిని ఎంపిక చేశారు. పూర్తి సబ్సిడీతో రూ.6 లక్షల ​వ్యయంతో బోర్, పైప్​లైన్, స్ప్రింక్లర్, డ్రిప్​ అందిస్తున్నారు. ఇద్దరికి కలిపి ఒక బోర్​వేయిస్తున్న అధికారులు ఇప్పటివరకు 16 బోర్లు తవ్వించారు. సోలార్​ ప్యానెల్స్, మోటార్లు, పైప్​లైన్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ద్వారా పండ్ల మొక్కలు నాటారు. 

అంతర పంటల సాగుపై శిక్షణ

ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా మాచారంలో మామిడి, అవకాడో, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి ఇతర జాతుల పండ్ల మొక్కలు నాటించింది. మొక్కల పెంపకం, కత్తిరింపు, తెగులు, ఎరువుల వినియోగం, కలుపు నివారణతోపాటు అంతర పంటల సాగుపై చెంచులకు శిక్షణ ఇప్పించింది. సోలార్​పంపులు, స్ప్రింకర్ల వినియోగాన్ని రెడ్​కో సిబ్బంది దగ్గరుండి నేర్పించారు. చెంచులు వర్షాధారంగా జొన్నలు పండించే వారని, మబ్బులు ముఖం చాటేస్తే పంటకు గ్యారంటీ ఉండకపోయేదని మాజీ సర్పంచ్ పెద్దిరాజు తెలిపారు. ఈ పథకం ప్రారంభమైన 2 నెలల తర్వాత వానాకాలం సీజన్​లో అంతర పంటగా పత్తి, వేరుశనగ సాగు చేశారని, పండ్ల తోటలకు డ్రిప్​ ద్వారా, పత్తి, వేరుశనగ పంటలకు స్ర్పింక్లర్లతో నీరందిస్తున్నట్లు చెప్పారు. గతంలో తెగుళ్ల కారణంగా వేరుశనగ పంట నష్టపోయామని, ఈసారి మాత్రం మంచి దిగుబడి వస్తుందని ధీమా 
వ్యక్తం చేశారు.  

భవిష్యత్​కు గ్యారంటీ ఇచ్చిందంటున్న చెంచులు

రాష్ట్ర ప్రభుత్వం తమ రెక్కల కష్టానికే కాదు తమ బతుకులకు, భవిష్యత్​కు గ్యారంటీ ఇచ్చిందని చెంచులు అంటున్నారు. చెంచు రైతు మల్లయ్య చిని తోటలో వేరుశనగను అంతర  పంటగా సాగు చేశాడు. మహిళా రైతు అలివేల నిమ్మ తోట మధ్యలో వేరుశనగ వేసింది. మాజీ సర్పంచ్ పెద్దిరాజు అవకాడో తోటలో అంతర​పంటగా పత్తి సాగు చేస్తున్నారు. అలివేల మాస్టర్​ట్రైనర్​గా ఇతర చెంచుపెంటల్లో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తున్నారు.