వాట్సాప్ ద్వారా కేసు విచారణ

వాట్సాప్ ద్వారా కేసు విచారణ

కేసు విచారణ  ఎలా చేస్తారు ? గిదేం ప్రశ్న. కోర్టుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టి తీర్పును చెబుతారు అంటారు కదా. కానీ.. ఓ న్యాయమూర్తి వాట్సాప్ (Whatsapp) ద్వారా విచారణ చేపట్టి.. తీర్పును వెలువరించారు. భారతదేశంలో ఇలా జరగడం తొలిసారి అని అంటున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నై హైకోర్టు (madras high court) లో దాఖలైన పిటిషన్ ను జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వాట్సాప్ ద్వారా విచారణ చేపట్టి.. తీర్పును వెలువరించారు. 

చెన్నై హైకోర్టు : -
అత్యవసర పిటిషన్లు దాఖలు అయిన సమయంలో విచారించేందుకు చెన్నై హైకోర్టు కొన్ని వెసులుబాటులు కల్పించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని రథయాత్రలో గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో దేవాదాయశాఖ పలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆలయ ధర్మకర్త పీఆర్ శ్రీనివాసన్ హైకోర్టు తలుపులు తట్టారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు సెలవులు ఉండడం.. హైకోర్టు న్యాయమూర్తి స్వామి నాథన్ ఓ వివాహ వేడుక కోసం నాగర్ కోయిల్ వెళ్లారు. దీంతో ఈ కేసును విచారించేందుకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకున్నారు. న్యాయమూర్తితో పాటు పిటిషన్ దారు, ఆయన తరపు అడ్వకేట్, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరంలు వేర్వేరు ప్రాంతాల నుంచి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి స్వామి నాథన్ తుది తీర్పును వెలువరించారు. రథయాత్రను నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. రథయాత్రకు వచ్చే భక్తుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

రథయాత్ర ఎందుకు వద్దన్నారు ?
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా పాపరపట్టిలో అభీష్టవరదరాజ స్వామి ఆలయం (Sri Abheeshta Varadaraja Swamy temple) ఉంది. ఈ ఆలయంలో రథయాత్రను నిర్వహిస్తుంటారు. గతంలో జరిగిన రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథానికి సంబంధించిన విద్యుత్ తీగలు తగిలి 11 మంది భక్తులు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. సోమవారం జరగాల్సిన రథోత్సవం నిర్వహించవద్దని దేవాదాయ శాఖ ఆదేశించింది. దీంతో ఆలయ ధర్మకర్త హైకోర్టుకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.