బంగారం స్కీం పేరుతో జనాన్ని 26 కోట్లు ముంచిన్రు

బంగారం స్కీం పేరుతో జనాన్ని 26 కోట్లు ముంచిన్రు

చెన్నై:గోల్డ్ స్కీంల పేరుతో భారీ మోసానికి పాల్పడిన చెన్నైలోని కేరళ ఫ్యాషన్ జ్యువెల్లరీ(కేఎఫ్​జే) స్టోర్ ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేండ్లలో  1,689 మంది నుంచి రూ. 26 కోట్ల డిపాజిట్లు కలెక్ట్ చేశారని చెప్పారు. ఈ కేసులో కేఎఫ్​జే స్టోర్​ ఎండీ సుజిత్​ చెరియన్, డైరెక్టర్​ సునీల్​ చెరియన్​ను ఆదివారం కోర్టులో ప్రొడ్యూస్  చేశారు. బెయిల్​ కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్​ను స్పెషల్​ జడ్జి కొట్టేశారు.

ఏం జరిగింది..

చిన్న మొత్తంలో కొంతకాలంపాటు డబ్బు డిపాజిట్​ చేస్తే ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం ఇస్తామంటూ చెన్నైలోని కేఎఫ్​జే స్టోర్​బాగా ప్రచారం చేసింది. బంగారం కుదవ పెట్టుకుని లోన్లు కూడా ఇస్తామని సంస్థ ఓనర్లు జనాలను నమ్మించారు. ఇలా 2016 నుంచి 2019 మధ్య  1,689 మంది నుంచి రూ. 26 కోట్ల డిపాజిట్లు కలెక్ట్ చేశారు. ఒక గ్రాము రూ.1999  చొప్పున 100 గ్రాములు గోల్డ్ కొనేందుకు తాను కేఎఫ్​జే వాళ్ల స్కీంలో చేరానని, తనను రూ.2 లక్షల మేర మోసం చేశారని లింగస్వామి అనే ఇంజనీర్​2019లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. స్టోర్​ నిర్వాహకులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డయి. స్టోర్​లో డబ్బులు డిపాజిట్​ చేసినోళ్లంతా తమ సొమ్ము వాపస్​ ఇవ్వాలని చెరియన్​ బ్రదర్స్​పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కేఎఫ్​జే స్టోర్​ను చెరియన్​ బ్రదర్స్ మూసేశారు. స్కీంల పేరుతో సేకరించిన సొమ్మంతా బినామీ ఎకౌంట్లలోకి తరలించినట్లు కస్టమర్లు ఆరోపించారు. తాము కోల్పోయిన డబ్బులను చెరియన్ బ్రదర్స్ ఆస్తులను అమ్మైనా తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.