ఆకర్షిస్తున్న నేపియర్ బ్రిడ్జి

ఆకర్షిస్తున్న నేపియర్ బ్రిడ్జి

తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రధాన బ్రిడ్జిలలో ఒకటైన నేపియర్ బ్రిడ్జి అందరినీ ఆకట్టుకొంటోంది. బ్రిడ్జి మొత్తం చెస్ బోర్డుగా మారిపోయింది. నలుపు, తెలుగు రంగులతో నిండిపోయింది. మొన్నటి దాక మాములుగా ఉన్న ఈ బ్రిడ్జి రాత్రికి రాత్రే మారిపోవడంతో నగర వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలువురు బ్రిడ్జి వద్దకు వెళ్లి.. సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది.

తమిళనాడులోని మామళ్లాపురంలో ఈ నెల 28వ తేదీ నుంచి 44వ ఫైడ్ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫైడ్) ఆధ్వర్యంలో ఇవి జరుగనున్నాయి. అందుకే ఒలింపియాడ్ కు గుర్తింపుగా నేపియర్ బ్రిడ్జి చెస్ గళ్లతో నింపేశారు. పోటీల్లో 189 జట్లు నమోదు చేసుకున్నాయి. మహిళల విభాగంలో 162 జట్లు నమోదయ్యాయి. ప్రపంచం నుంచి నలుమూలల వందలాది మంది చెన్నైకి రానున్నారు. క్రీడాకారులు ధరించిన దుస్తులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ టీజర్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది.