IPL 2023 : చితక్కొట్టిన చెన్నై.. లక్నోకు భారీ టార్గెట్

IPL 2023 : చితక్కొట్టిన చెన్నై.. లక్నోకు భారీ టార్గెట్

చెపాక్ వేదికపై జరుగుతున్న చెన్నై, లక్నో మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై దూకుడుగా ఆడింది. మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు గైక్వాడ్, కాన్వే.. లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (57, 31 బంతుల్లో), డేవాన్‌ కాన్వే (47,29 బంతుల్లో) రాణించారు. 

తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా మెరుపులు మెరిపించారు. శివమ్‌ దూబె (27,16 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. చివర్లో అంబటి రాయుడు (27, 14 బంతుల్లో), ధోనీ (12, 3 బంతుల్లో) తలా ఓ చేయి వేసేసరికి చెన్నై 200 పరుగుల మైలు రాయిని దాటింది. లక్నో బౌలర్లలో మార్క్ ఉడ్, రవి బిష్నయ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.

పవర్ ప్లేలో 79 పరుగులు.. 

పవర్ ప్లై ముగిసేసరికి సీఎస్కే.. వికెట్‌ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. బౌలింగ్ కు వచ్చిన ప్రతి బౌలర్ ను చితకబాదారు. ఓపెనర్లు 8 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పదో ఓవర్ వేసిన రవీ బిష్ణోయ్ గైక్వాడ్ ను పెవిలియన్ చేర్చాడు. దీంతో భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తర్వాతి ఓవర్లోనే కాన్వాయ్.. మార్క్ ఉడ్ బౌలింగ్ లో వికెట్ పారేసుకున్నాడు.

స్టోక్స్, జడేజా మళ్లీ..

భారీ అంచనాలతో సీఎస్కే జట్టులోకి వచ్చిన బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా మళ్లీ నిరాశ పరిచారు. స్టోక్స్ (8) అవేశ్ ఖాన్ వేసిన 17 ఓవర్లో చివరి బంతికి యశ్ ఠాకూర్ కు చిక్కాడు.  మార్క్‌వుడ్‌ వేసిన 20 ఓవర్లో జడేజా (3) ఔట్ అయ్యాడు.

ధోనీ సిక్సులు.. 

20 ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ చెలరేడి ఆడాడు. మార్క్‌వుడ్‌ వేసిన 20 ఓవర్‌లో మొదటి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. తర్వాతి బంతికే రవి బిష్ణోయ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.