చెన్నై చెమక్‌..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ

చెన్నై చెమక్‌..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ

దుబాయ్‌‌: మూడు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ గెలుపు బాట పట్టింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 10 వికెట్ల  తేడాతో పంజాబ్‌‌ను ఓడించింది. ఓపెనర్లు డుప్లెసిస్‌‌ (53 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 87 నాటౌట్‌‌), షేన్‌‌ వాట్సన్‌‌ (53 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 నాటౌట్‌‌) దంచికొట్టారు. దీంతో 179 పరుగుల టార్గెట్‌‌ను చెన్నై 17.4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 181 రన్స్‌‌ చేసి ఛేదించింది. కాట్రెల్‌‌ వేసిన ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే వాట్సన్​ రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. రెండో ఎండ్‌‌లో డుప్లెసిస్‌‌ కూడా ఎక్కడా తగ్గలేదు. ఆరో ఓవర్‌‌లో డుప్లెసిస్‌‌ 4, 4, 4, 4తో 19 రన్స్‌‌ పిండుకోవడంతో పవర్‌‌ప్లేలో చెన్నై 60 రన్స్‌‌ చేసింది. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన స్పిన్నర్‌‌ బిష్ణోయ్‌‌, హర్‌‌ప్రీత్‌‌ను కూడా వదల్లేదు. 8వ ఓవర్‌‌లో ఇద్దరు కలిసి 3 ఫోర్లు, తర్వాతి ఓవర్‌‌లో వాట్సన్‌‌ ఓ ఫోర్‌‌, సిక్స్‌‌ కొట్టడంతో 14 రన్స్‌‌ వచ్చాయి. దాంతో ఫస్ట్‌‌ టెన్‌‌లోనే చెన్నై 100 రన్స్‌‌ దాటేసింది. 11వ ఓవర్‌‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన వాట్సన్‌‌ 31 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. ఆ వెంటనే డుప్లెసిస్‌‌ కూడా 33 బాల్స్‌‌లో ఈ మార్క్‌‌ను అందుకున్నాడు. 12, 13 ఓవర్లలో వరుసగా 7, 4 పరుగులే వచ్చాయి. 14వ ఓవర్‌‌లో స్ట్రెయిట్‌‌ సిక్సర్‌‌తో వాట్సన్‌‌ జోరు పెంచాడు. తర్వాతి ఓవర్‌‌లోనూ సిక్సర్‌‌, ఫోర్‌‌ రాబట్టడంతో 15 ఓవర్లలో చెన్నై స్కోరు 150కి చేరింది. ఇక గెలవాలంటే 30 బాల్స్‌‌లో 29 రన్స్‌‌ కావాల్సిన దశలోనూ ఈ ఇద్దరు  సింగిల్స్​తో పాటు నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌‌తో విజయాన్ని అందించారు. షేన్​ వాట్సన్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

రాహుల్‌‌, పూరన్‌‌ ఓకే..

అంతకుముందు టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 రన్స్‌‌ చేసింది. రాహుల్‌‌ (52 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 63) కు నికోలస్‌‌ పూరన్‌‌ (17 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్సర్లతో 33) అండగా నిలిచాడు. ఆరంభం నుంచే కుదురుగా ఆడిన రాహుల్, మయాంక్‌‌ (26) ఎక్కువగా బౌండ్రీలపైనే ఆధారపడ్డారు. అయితే 9వ ఓవర్‌‌లో చావ్లా ఈజోడీని విడగొట్టాడు. స్లైడింగ్‌‌ బాల్‌‌ను మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా భారీ షాట్‌‌కు యత్నించిన మయాంక్‌‌.. కరన్‌‌ చేతికి చిక్కాడు. ఫలితంగా తొలి వికెట్‌‌కు 61 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. రాహుల్‌‌తో జతకట్టిన మన్‌‌దీప్‌‌ సింగ్‌‌ (27) ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌‌ 10 ఓవర్లలో 71/1 స్కోరుతో నిలిచింది. 11వ ఓవర్‌‌ (చావ్లా)లో మన్‌‌దీప్‌‌ మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌‌లోనే జడేజాకు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఈ దశలో వచ్చిన పూరన్‌‌ కీలక ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. బ్రావో బౌలింగ్‌‌లో సింగిల్‌‌తో ఖాతా తెరిచినా.. జడేజా (14వ ఓవర్‌‌) బాల్స్‌‌ను 4, 6గా మలిచి దూకుడు చూపెట్టాడు. 15వ ఓవర్‌‌లో రాహుల్‌‌ వరుసగా 6, 4, 4తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 46 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. పంజాబ్‌‌ స్కోరు కూడా 130/2కు చేరింది. తర్వాతి రెండు ఓవర్లలో రెండు సిక్సర్లతో 22 రన్స్‌‌ రాబట్టిన ఈ జోడీ.. 18వ ఓవర్‌‌లో వరుస బంతుల్లో ఔటయ్యారు. దీంతో మూడో వికెట్‌‌కు 58 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో మ్యాక్స్‌‌వెల్‌‌ (11 నాటౌట్‌‌), సర్ఫరాజ్‌‌ (14 నాటౌట్‌‌) మూడు ఫోర్లు బాదడంతో 23 రన్స్‌‌ సమకూరడంతో పంజాబ్‌‌ మంచి స్కోరు సాధించింది.