విమానంలో 130 మంది ప్రయాణికులు.. పేలిన టైరు

విమానంలో 130 మంది ప్రయాణికులు.. పేలిన టైరు

గురువారం(జనవరి 18) తెల్లవారుజామున, 130 మంది ప్రయాణికులతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు బయల్దేరిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం టైర్ పేలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నప్పటికీ.. విమానం వెనుక చక్రం పేలడంతో, దానిని గ్రౌండింగ్ చేయవలసి వచ్చింది. దీంతో ప్రయాణికులును హోటళ్లకు తరలించి వసతి కల్పించారు. 

ఏం జరిగిందంటే..?

మలేషియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన MH 181 విమానం గురువారం ఉదయం 12.20 గంటల సమయంలో చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌ వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ కోసం దాని బే నుండి రన్‌వేకి మారగా.. ఆ సమయంలో దాని వెనుక చక్రం పెద్ద శబ్దంతో పేలింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. తదనంతరం ప్రయాణీకులకు నగర హోటళ్లలో వసతి కల్పించారు. శుక్రవారం ఉదయం విమానం తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.