
- రమేశ్‌బాబు ఇంటికి నోటీసులు అంటించిన అధికారులు
వేములవాడ, వెలుగు: ఎన్నో ఏండ్లుగా జర్మనీ పౌరసత్వం వివాదంలో ఉన్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఓటు హక్కును హైకోర్టు తీర్పు నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ మేరకు ఆయన ఇంటికి శనివారం నోటీసులు అంటించారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమనేని రమేశ్ బాబు వేములవాడ ఎమ్మెల్యేగా అప్పటి కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ పై తక్కువ ఓట్లతో గెలుపు పొందారు. 2009, 2010, 2014, 2018 నాలుగు సార్లు వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే, రమేశ్‌బాబు జర్మనీ, ఇండియా ద్వంద్వ పౌరసాత్వం కలిగి ఉన్నాడని, అతను అక్రమ మార్గాల ద్వారా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాడని, ఆయన భారతదేశ పౌరుడు కాదని ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై సుదీర్ఘకాలం వాదనలు కొనసాగిన తర్వాత రమేశ్ బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జూన్ 24న ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించేందుకు రమేశ్ బాబుకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. జులై 2వ తేది లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ జాబితాలో 176వ బూత్ నుంచి రమేశ్‌బాబు పేరును తొలగించినట్టు వెల్లడిస్తూ ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు.