నాపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ

నాపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ

చెన్నూర్, వెలుగు: మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ తన పేరును బద్నాం చేస్తున్నారని  చెన్నూర్ మున్సిపల్​ కమిషనర్​ మురళీకృష్ణ తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీ,  మున్సిపల్ కమిషనర్ పై పలు ఆరోపణలు చేస్తూ కొద్ది రోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

కొందరు వ్యక్తులు వారి స్వలాభం కోసం మున్సిపాలిటీలో పేరు సవరణ, పేరు మార్పిడి, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి తనను సంప్రదించగా.. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో తాను ఆ పనులు చేయలేదన్నారు. దీంతో తనపై కక్షగట్టిన ఆ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే కొంతమంది రిపోర్టర్లు మీడియాలో,  సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని అన్నారు. 

రెండు రోజుల కిందట రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ విషయమై ఇలాగే తప్పుడు ప్రచారం చేశారన్నారు. నియాజుద్దీన ఇంటి నంబర్ 22-70 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆ బకాయిలు చెల్లించకపోగా మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. విషయం తెలుసుకోకుండా నియాజుద్దీన్ చేసిన ఆరోపణలను కొందరు మీడియా ప్రతినిధులు ప్రచురించడంతో పాటు ఎలక్ట్రానిక్​ మీడియాలో ప్రసారం చేశారని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో కూడిన వార్తలను ప్రజలు నమ్మరాదని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ప్రజలు మధ్యవర్తుల మాటలను నమ్మకుండా సరైన డాక్యుమెంట్లతో సంప్రదించినట్లయితే తప్పకుండా వారి పనులు చేస్తామని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన రిటైర్డ్ ఎమ్మార్వో నియాజుద్దీన్ పై పోలీస్ స్టేషన్​ లో ఫిర్యాదు చేసినట్లు చెన్నూర్​ కమిషనర్​ మురళీ కృష్ణ తెలిపారు.