సుమన్ అహంకారాన్ని దించుదాం.. చెన్నూరును బాగు చేసుకుందాం : వివేక్ వెంకటస్వామి

సుమన్ అహంకారాన్ని దించుదాం.. చెన్నూరును బాగు చేసుకుందాం : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్.. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి.. అహంకారంతో ప్రజలను బెదిరిస్తూ.. తిరుగుతున్నారని.. మళ్లీ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తున్నాడంటూ విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్, బెల్లంపల్లి రైలు తీసుకొచ్చానని.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించటానికి వందలసార్లు ప్రయత్నించి సాధించానని వివరించారు. దీని వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. 15 ఏళ్ల క్రితమే మందమర్రిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారాయన. చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మందమర్రిలో ఇప్పటికీ రోడ్లు బాగోలేదని.. మంచినీటి సమస్య ఉందని.. ఐదేళ్లలో కనీసం పరిష్కరించుకుండా ప్రజలను ఇబ్బంది పెట్టాడని వెల్లడించారాయన. డబ్బులతో ఓట్లు కొనాలని బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నారని.. ఆ డబ్బు కూడా మన చెన్నూరు డబ్బులే అని.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ బండ వస్తుందని.. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేయించుకోవటానికి గ్యారంటీ కార్డు ఇస్తామని హామీ ఇచ్చారాయన. ప్రతి మహిళకు ప్రతి నెలా 2 వేల 500 రూపాయలు ఇస్తామని.. రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని.. కౌలు రైతులకు 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారాయన. ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ గ్యారంటీ ద్వారా సంక్షేమం అమలు చేస్తామని వివరించారాయన. 

ఇందిరమ్మ ఇల్లు పథకం కింద పేద కుటుంబాలకు ఇంటి స్థలం ఇవ్వటంతోపాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నేత నల్లాల ఓదేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.