నేడు మంత్రి కేటీఆర్​ పర్యటన : బాల్క సుమన్

నేడు మంత్రి కేటీఆర్​ పర్యటన :  బాల్క సుమన్

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ఆదివారం మందమర్రి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారని చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి టూర్​ వివరాలను వెల్లడించారు. 

మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్లు, క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో రూ.108.16  కోట్లు, మొత్తం రూ.312.96 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేస్తారని చెప్పారు. అలాగే మందమర్రి మండలం శంకర్​పల్లిలో మ్యాట్రిక్స్​ కంపెనీ ఆధ్వర్యంలో రూ.500 కోట్లతో పామాయిల్​ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు. 

ఈ సందర్భంగా మందమర్రిలో రోడ్​షో, రామకృష్ణాపూర్​లోని ఠాగూర్​ స్టేడియంలో సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు... 

జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బాల్క సుమన్​ అన్నారు. కలెక్టరేట్​లో జర్నలిస్టులతో మీటింగ్​ నిర్వహించారు. మంచిర్యాలలో రూ.కోటితో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయి రిపోర్టర్లు తహసీల్దార్ల సమన్వయంతో స్థల ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్​కు పంపించాలన్నారు. వీటిని సీసీఎల్​ఏకు పంపి అక్కడినుంచి అనుమతులు రాగానే ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

అలాగే అర్హత గల జర్నలిస్టులకు గృహలక్ష్మి స్కీమ్​ శాంక్షన్​ చేస్తామన్నారు. ఎంపీ బి.వెంకటేశ్​నేత, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్​రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్​ బదావత్​ సంతోష్​ పాల్గొన్నారు.